
గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం
● జేసీ కార్తీక్
నెల్లూరు రూరల్: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జేసీ కార్తీక్ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయమై అధికారులు, వ్యాపారులు, రైస్ మిల్లర్లకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. మండలానికో కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో సివిల్ సప్లయ్స్, వ్యవసాయ, పోలీస్ శాఖల నుంచి ఒకర్ని నియమించాలని సూచించారు. పుట్టికి ప్రస్తుతం రూ.16,800 గిట్టుబాటు ధర లభిస్తోందని, దీనికి కట్టుబడి ఉంటామన్నారు.
30 శాతం కోతలు పూర్తి
జిల్లాలో వరికోతలు ప్రస్తుతానికి 30 శాతం పూర్తయ్యాయని రైతు సంఘ నేతలు తెలిపారు. పుట్టిని దళారులు, మిల్లర్లు రూ.16 వేలకు కొనుగోలు చేస్తున్నారని, అదే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారు రూ.16,700 మేర అందజేస్తున్నారని చెప్పారు. అయితే వీరు రైతుల వద్దకు రాకుండా రాజుపాళెంలోని ఏజెంట్లను పంపించి స్థానిక దళారులు ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.19,720 మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. గంగపట్నం రమణయ్య, షానవాజ్ తదితరులు పాల్గొన్నారు.