
ఉపాధి శ్రామికుల ఆకలి కేకలు
వారందరూ శ్రామికులు. ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే తమ బతుకు బండిని నెట్టాలి. అయితే వీరి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకంగా నాలుగు నెలల నుంచి వీరికి నగదును అందించలేదంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరికి మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాలతో పనులకు హాజరవ్వాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ శ్రామికులకు వేతనాలు మూడున్నర నెలలుగా అందలేదు. వీరు చేసిన పనులకు గానూ దాదాపు రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా, మీనమేషాలను ప్రభుత్వం లెక్కిస్తోంది. ఇవి అందక శ్రామికులు నానా అగచాట్లు పడుతున్నారు. శ్రామికులతో పనులు చేయిస్తున్న అధిక శాతం మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి.
ప్రశ్నల వర్షం
కూలీలకు రెండు వారాల వేతనాలను మే 21న చెల్లించారు. అప్పటి నుంచి వీరికి చిల్లిగవ్వ అందలేదు. పనుల పర్యవేక్షణకు వెళ్తున్న అధికారులపై ప్రశ్నల వర్షాన్ని శ్రామికులు కురిపిస్తున్నారు. ఈ నిధులను కేంద్రం నుంచి తీసుకురావడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. 2021 నుంచి ఉపాధి పని దినాలు ఏటా కోటికిపైగానే ఉన్నాయి. అయితే కూటమి సర్కార్ కొలువుదీరాక ఇవి పెరగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 1.19 కోట్ల పని దినాలను పూర్తి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల లక్ష్యాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్దేశించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని పెంచలేదు. ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభంలో 65 లక్షల పనిదినాల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించగా, ఇప్పటి వరకు 63.61 లక్షల మేరే పూర్తి చేశారు. మిగిలిన లక్ష్యం రెండు వారాల్లో పూర్తికానుంది. ఆ తర్వాత శ్రామికులకు పనులుండవు.
అదనంగా కల్పిస్తేనే ప్రయోజనం
వాస్తవానికి కేంద్రం నిర్దేశించిన పనిదినాలు ఆగస్ట్‌లో పూర్తవుతాయి. మంత్రులు చర్చించి వీటిని అదనంగా మంజూరు చేయించాలి. ఇలా చేయడం ద్వారా డిసెంబర్ వరకు శ్రామికులకు పనులు లభించేవి. అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో చర్చించినా, ఎలాంటి ఫలితం లేదని సమాచారం. వీటిని అధికంగా కల్పిస్తే దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్‌తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలకు నిధులు మంజూరవుతాయి.
పనుల కేటాయింపులోనూ రాజకీయాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఉపాధి పనులను కల్పించడంలేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి సర్కార్ భారీగా తొలగించింది. వారి స్థానంలో రాజకీయ నేతలు తమ అనుచరులను నియమించారు. నూతనంగా పనిచేస్తున్న వీరు తమ అనుయాయులకే పనులు కల్పిస్తున్నారు. దుత్తలూరు, కావలి, దగదర్తి, బోగోలు తదితర మండలాల్లో ఈ తంతు అధికంగా ఉంది. ఫలితంగా పనుల్లేక.. వేతనాలు అందక శ్రామికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మూడున్నర నెలలుగా అందని వేతనాలు
రూ.70 కోట్లకుపైగా బకాయిలు
65 లక్షల పనిదినాల కల్పనే లక్ష్యం
ఇప్పటి వరకు చేసింది 63.61 లక్షలు
అదనంగా మంజూరు చేయని కేంద్రం