
సమాజ నిర్మాణంలో టీచర్లదే కీలకపాత్ర
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నేటి కాలంలో ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యా రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించగల శక్తులుగా మారాలన్నారు. విద్యార్థులలో పాఠ్య జ్ఞానం మాత్రమే కాకుండా మానవీయ విలువలు, నైతికత, సామాజిక బాధ్యతలను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. వీఎస్‌యూ ఏంబీఏ విభాగం అధ్యాపకురాలు సుజా ఎస్.నాయర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో డీకే కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సి.శారద, వీఎస్‌యూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత తదితరులు పాల్గొన్నారు.