
కూటమి పాలనలో వ్యవసాయం కుదేలు
● రైతులకు తప్పని తిప్పలు
● హామీల అమల్లో చంద్రబాబు విఫలం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
మనుబోలు: ‘కూటమి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. రైతులకు తిప్పలు తప్పడం లేదు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మనుబోలు మండల కేంద్రంలోని చిట్టమూరు అజయ్‌రెడ్డి నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు. యూరియాను మార్క్‌ఫెడ్ ద్వారా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఆర్బీకేల ద్వారా ఎందుకు సరఫరా చేయరని నిలదీశారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అవసరమైనవన్నింటినీ ఆర్బీకేల ద్వారా నేరుగా అందజేశారన్నారు. యూరియా దొరక్క ఓ వైపు రైతులు గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జిల్లాలో రెండో పంట కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఎందుకు ధాన్యానికి మద్దతు ధర ప్రకటించలేదని ప్రశ్నించారు. పుట్టి ధాన్యం రూ.19,770 ఉండగా, దళారులు రూ.15 వేలకే రైతుల నుంచి కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చామన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, తల్లికి వందనం పథకాన్ని సైతం అరకొరగా అమలు చేశారని విమర్శించారు. దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయగా, వైఎస్సార్సీపీ ఆందోళనలతో మళ్లీ ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాపాలన్నీ ప్రజలు లెక్కిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అనితమ్మ, నాయకులు మన్నెమాల సాయిమోహన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీందర్‌రెడ్డి, సూరపనేని కిశోర్ నాయుడు, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, దాసరి భాస్కర్‌గౌడ్, గుంజి రమేష్, గిరి, దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు.
38 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు