
దర్జాగా కబ్జా
● ప్రభుత్వ భూమి అనే బోర్డున్నా, లెక్కచేయని వైనం
● గ్రావెల్‌ను భారీగా కొల్లగొడుతూ..
● రెవెన్యూ అధికారుల సహకారం
కలువాయి (సైదాపురం): ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని కబ్జా చేయడంలో కూటమి నేతలు ముందు వరుసలో ఉంటున్నారు. తాజాగా వీరి కన్ను మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూమిపై పడింది. రూ.లక్షల విలువజేసే దీన్ని దర్జాగా ఆక్రమించి.. మట్టిని కొల్లగొడుతూ యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కుల వ్యవహారాలను మీడియా బయటపెడుతున్న తరుణంలో రెవెన్యూ వారు సైతం కొత్త ట్రిక్కులను నేర్చుకుంటున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయగానే ముందుగానే ప్రభుత్వ బోర్డును పెట్టి.. పగలూ, రాత్రనే తేడా లేకుండా మట్టి తోలుకునేందుకు ప్రోత్సహిస్తూ తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
కొత్త కథలు..
నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న భూమి ముందుంది ప్రభుత్వ భూమి అని.. వెనుకుంది మాత్రం పక్కా అంటూ రెవెన్యూ అధికారులు కొత్త కథలు చెప్తున్నారు. రూ.30 లక్షల విలువజేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు కబ్జా చేస్తున్నా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ అధికారులూ నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. జంక్షన్ల వద్ద తూర్పు, పడమర 40 నుంచి 50 మీటర్ల స్తీర్ణం కలిగి ఉండాలి. వీటికి పరిహారాన్నీ ఇచ్చారు. భూములను ఆక్రమిస్తున్న వ్యవహారం వీరికి తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయమై ఇన్‌చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 360లో కొంత ప్రభుత్వ భూమి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. దీనిక వెనుక వైపు పట్టా ల్యాండ్ అని తెలిపారు. ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు. మట్టిని అక్రమంగా తోలుతున్న విషయమై ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించగా, సమాధానాన్ని దాటేశారు.