
హెల్త్ అసిస్టెంట్లకు అన్యాయం
నెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 170 మందికి పైగా హెల్త్ అసిస్టెంట్లను ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికంటూ తెలంగాణ కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం తొలగించి తీరని అన్యాయం చేసిందని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో తొలగించబడిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు చెందిన కుటుంబాలను ఏపీ హంస నాయకులు గురువారం పరామర్శించారు. వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతపేట సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్‌రావు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు కల్పించారన్నారు. వీరంతా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతోపాటు కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలందించారన్నారు. రెగ్యులర్ అవుతామనే ఆశతో విధులు నిర్వర్తిస్తుండగా తెలంగాణ కోర్టు తీర్పును ఏపీకి ఆపాదించి వందలాది మందిని తొలగించారన్నారు. పిల్లల్ని చదివించుకోలేక, అద్దెలు కట్టలేక, వయో పరిమితి దాటి పోవడంతో వేరే ఉద్యోగాలు రాక వారంతా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ హంస తాలూకా ప్రెసిడెంట్ సోమేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాపారావు, ఉద్యోగ సంఘం నాయకులు స్టీఫెన్ కుమార్, జాన్ అంకయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.