
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
● తహసీల్దార్ల సమావేశంలో బొప్పరాజు
నెల్లూరు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను కాపాడేందుకు, భూ సంబంధిత రికార్డుల నిష్పక్షపాత నిర్వహణకు రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన తహసీల్దార్లు అంకితభావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్ సూచించారు. గురువారం సాయంత్రం నెల్లూరులోని నెల్లూరు క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన తహసీల్దార్ల సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిజాయితీతో పనిచేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలిపారు. అదే సందర్భంలో ఉద్యోగులకు ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. తహసీల్దార్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వడం ద్వారా పారదర్శక పాలన అందిస్తారన్నారు. ఈ సందర్భంగా పలువురు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గురించి మాట్లాడారు. పరిష్కార మార్గాల గురించి చర్చించారు. సంఘం బలోపేతంగా ఉండటం ద్వారా ఉద్యోగుల హక్కులను సాధించుకోవచ్చని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు అల్లంపాటి పెంచలరెడ్డి, డానియేల్ పీటర్‌రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ మురళి, జిల్లాలోని పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.