
కూటమి అరాచకాలకు చరమగీతం పాడుదాం
రాపూరు/సైదాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి పోతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిని కూకటి వేళ్లతో సహ పెకళించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభంజం సృష్టించడం ఖాయమని ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాపూరులోని బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టడంలో కూటమి ప్రభుత్వం కుట్రలు పతాక స్థాయికి చేరాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలకు చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. 1995 నాటి సీఎంను ప్రజలకు చూపిస్తామని మాట్లాడుతున్న చంద్రబాబు, గతంలో కూడా కూతురినిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్నారని గుర్తుచేశారు. ఆ తరహాలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. వయసు మీద పడుతున్నా.. గతంలో చేసిన అరాచక పాలనే సాగిస్తున్నారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పని సరిగా తగులుతుందన్నారు. ఎంతో రాజకీయ అనువభం ఉన్న నేదురుమల్లి కుటుంబం నుంచి వారసుడు రామ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని, రామ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకునేందుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో వెంకటగిరి అభివృద్ధికి దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్‌రెడ్డి సతీమణి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎన్నో శాశ్వతమైన పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి అదే తరహాలో అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వెంకటగిరి నుంచే గెలుపు ఆరంభమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే
వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా మాట్లాడడం సమంజసం కాదు
వచ్చే ఎన్నికల్లో రామ్‌కుమార్‌రెడ్డి
అత్యధిక మెజార్టీ ఖాయం
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి