
జలవనరుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరురూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ (రిపేర్, రెన్నోవేషన్, రెస్టోరేషన్) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో జరిగిన జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పంటలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు, నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెంచడమే ఆర్‌ఆర్‌ఆర్ స్కీం ప్రధాన లక్ష్యమని చెప్పారు. డ్వామా, భూగర్భ జల, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ పథకం కింద రూ.35,519.56 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన జిల్లాలోని 220 మైనర్ ఇరిగేషన్ చెరువులను క్షుణ్ణంగా పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తద్వారా సుమారు 26,928 హెక్టార్ల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుందని చెప్పారు. చెరువులను అభివృద్ధి చేసిన తర్వాత ఉపాధి హామీ పథకం ద్వారా ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్ మొదలైన పనులను చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. గ్రౌండ్ వాటర్ అధికారులు అవరసమైన సాంకేతిక సహాయాన్ని అందించాలన్నారు. తొలుత ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్ ఆర్‌ఆర్‌ఆర్ స్కీం ద్వారా చేపట్టాల్సిన చెరువులు, కాలువలు, చెక్‌డ్యామ్‌ల బలోపేతం, మరమ్మతు పనులు చేపట్టడం, నీటిపారుదల అవకాశాలను మెరుగు పరచడానికి చేపట్టాల్సిన చర్యలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల విభాగం శాస్త్రవేత్త పెరిక యాదయ్య, డ్వామా పీడీ గంగాభవాని, భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్ శోభన్‌బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయభాస్కర్, ఇరిగేషన్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.