
ఆగని దందా..
రోడ్డు నిర్మాణం కోసం ఉలవపాడు మండలంలోని కరేడు చెరువు నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలించారు. వాస్తవానికి సాగునీటి చెరువుల్లో తవ్వకాలను సాగించాలంటే ఆ శాఖ అధికారుల నుంచి అనుమతులను విధిగా పొందాలి. క్యూబిక్ మీటర్ మేరకు ధరను నిర్ణయించి ఆపై తవ్వుకునేందుకు అనుమతులను మంజూరు చేస్తారు. అయితే నియోజకవర్గంలో ఇలాంటివేవీ జరగడంలేదు. చెరువులను అధికార పార్టీ నేతలు తమ చేతుల్లోకి తీసుకొని భారీ ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, సాగునీటి శాఖ.. రెవెన్యూ అధికారులు గానీ ఆవైపు కన్నెత్తి చూసే సాహసం చేయడంలేదు.
కందుకూరు: నియోజకవర్గంలోని ఇరిగేషన్ చెరువుల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఇరిగేషన్ అధికారుల అండదండలు అక్రమార్కులకు పుష్కలంగా లభిస్తుండటంతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులను లక్ష్యంగా చేసుకొని తవ్వకాలకు భారీగా పాల్పడుతున్నారు.
పట్టపగలు.. జోరుగా
గుడ్లూరులోని పెద్దచెరువు నుంచి గ్రావెల్ తవ్వకాలను సోమవారం పట్టపగలు భారీగా చేపట్టారు. ఒక జేసీబీ, 20 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తమ తంతును సాగించారు. ఆపై గుడ్లూరులోని ఓ లేఅవుట్‌కు తరలించారు. చెమిడిదిపాడు పరిధిలోని దూదాలచెరువు నుంచీ ఇదే తరహాలో వ్యవహరించారు. తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రావెల్ అవసరమైన ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవడం.. తదుపరి స్థానికంగా ఉండే చెరువుల నుంచి అక్రమంగా కొల్లగొట్టి తరలించడం పరిపాటిగా మారింది.
సమాచారమిచ్చారంటూ ఫిర్యాదులు
తాను గ్రావెల్ తవ్వకాలకు సహకరిస్తున్నా.. తన శాఖలోని కొందరు సిబ్బంది సమాచారాన్ని బయటకు చెప్పడంతో పాటు విలేకరులకూ తెలియజేస్తున్నారంటూ వారిపై స్థానిక ప్రజాప్రతినిధి వద్దకెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండటంతో తనకు ఎదురేలేదనే రీతిలో అక్రమ సంపాదనకు ఇరిగేషన్ చెరువులను ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చెరువుల్లో భారీ ఎత్తున గుంతలను యంత్రాలతో తీసి గుల్ల చేస్తున్నా, సదరు అధికారి అడ్డుకోకపోగా, వ్యతిరేకించే కింది స్థాయి సిబ్బందిని సైతం బెదిరిస్తున్నారని సమాచారం.
కరేడు చెరువులో ఇటీవల జరిపిన మట్టి తవ్వకాలు
గుడ్లూరు పెద్ద చెరువులో ఇలా..
అనుమతులా.. అబ్బే..!
తీరుమార్చుకోని ఉన్నతాధికారి..
సంపూర్ణ సహకారం అందిస్తున్న
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి
చెరువుల్లో జోరుగా గ్రావెల్ తవ్వకాలు
పట్టపగలు దౌర్జన్యంగా సాగుతున్న ఈ దందాలో ఇరిగేషన్ శాఖలోని ఓ ఉన్నతాధికారి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఆయనే వెనుకుండి ఈ దందాను కొంతకాలంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి ఇప్పటి వరకు ఒక్కసారి సైతం అడ్డుకోకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తవ్వకాలు జరిగే ప్రదేశాలకు తన కింది స్థాయి సిబ్బంది సైతం వెళ్లకుండా నియంత్రిస్తున్నారని, తనకు చెప్పకుండా ఏ చెరువు వద్దకెళ్లేందుకు వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా మాఫియా నుంచి ముడుపులు భారీగా ముడుతున్నాయనే అంశం ఆ శాఖ సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది.

ఆగని దందా..