
గ్రావెల్‌ను కొల్లగొట్టి.. చెత్తతో గుంతలు నింపుతూ
● సర్వేపల్లిలో బరితెగించిన
కూటమి నేతలు
● పాపాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు. ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకొని కోట్లాది రూపాయల విలువజేసే గ్రావెల్ సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు. వారి ధనదాహానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలిన ఈ గుంతలను మాయం చేసేందుకు నెల్లూరులోని చెత్తనంతా తరలిస్తున్నారు.
అడ్డుకున్నా.. బెదిరించి
వెంకటాచలం మండలం సర్వేపల్లిలో కోట్లాది రూపాయల విలువజేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలల్లో వీటిపై కూటమి నేతల కన్ను పడింది. భూముల్లో విలువైన గ్రావెల్ ఉందని తెలిసిన వెంటనే, ఎలాంటి అనుమతుల్లేకుండా తరలించారు. తమకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు ఈ భూములను కేటాయించారంటూ గిరిజన కుటుంబాల్లోని పలువురు అప్పట్లోనే వెళ్లి అడ్డుకున్నా, నిర్వాహకులు బెదిరించి వారిని వెళ్లగొట్టారు. ఇక్కడ 10 నుంచి 15 అడుగుల లోతులో గ్రావెల్‌ను తవ్వి నెల్లూరులోని పలు లేఅవుట్లకు తరలించారు. టిప్పర్‌లో మట్టిని రూ.12 వేల నుంచి రూ.15 వేల చొప్పున విక్రయించారు. తవ్వకాలను ఐదు నెలల పాటు సాగించి, నిత్యం వందలాది టిప్పర్లలో తమ పనిని కానిచ్చారు. ఈ రకంగా వ్యవహరించినా భూగర్భ గనుల శాఖ, పోలీస్, రెవెన్యూ, అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు.
చెత్తతో నింపే పనిలో నిమగ్నం
గ్రావెల్ గుంతలను పూడ్చేందుకు గానూ నెల్లూరులోని చెత్తాచెదారాలు, వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. సర్వేపల్లిలో గ్రావెల్ గుంతలు సజీవ సాక్ష్యాలుగా ఉంటే, తాము ఇరుక్కునే ప్రమాదం ఉందనే ఆలోచనతో కూటమి నేతలు ప్రస్తుతం ఇలా వ్యవహరిస్తున్నారు. చెత్తాచెదారాలను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీని ద్వారా వచ్చే దుర్గంధంతో స్థానికులు నానా అవస్థ పడుతున్నారు. ఈ విషయమై టిప్పర్ల డ్రైవర్లతో గ్రామస్తులు మాట్లాడినా, వారు ఏ మాత్రం లెక్కచేయడంలేదు. అధికారులు పట్టించుకోకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంతల్లో నింపేందుకు ఉంచిన చెత్త వ్యర్థాలు
నింపిన చెత్తను చదును చేస్తున్న జేసీబీ

గ్రావెల్‌ను కొల్లగొట్టి.. చెత్తతో గుంతలు నింపుతూ