
టేకు చెట్లు నరికి.. తరలించింది టీడీపీ నేతలే
పొదలకూరు: తన పొలంలో రూ.కోటి విలువైన టేకు చెట్లను టీడీపీ నేతలు అక్రమంగా నరికించి తరలించారని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజేశ్వరమ్మ ఆరోపించారు. మండలంలోని మరుపూరు సమీపంలో గల రాజేశ్వరమ్మ పొలంలో అక్రమంగా నరికిన టేకు చెట్లను బలిజ సంఘం, బీజేపీ నేతలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పొదలకూరుకు చెందిన టీడీపీ నేత యశ్వంత్‌రెడ్డి, మురళి, అనిల్‌కుమార్‌రెడ్డి కలిసి తన పొలంలో టేకు చెట్లను అక్రమంగా నరికించి అక్కడే విక్రయించారని మరుపూరుకు చెందిన ఆ పార్టీ నేతలే పేర్లతో సహా వెల్లడించారని పేర్కొన్నారు. పొదలకూరు పోలీస్‌స్టేషన్లో గత నెల 26న తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ముందుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లొద్దని, పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టాలని ఆయన సూచించారని చెప్పారు. కేసు పెట్టక ముందు, ఆపైన సుమారు 12 రోజులుగా అందరి వద్దకెళ్లినా ప్రయోజనం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే చలో అమరావతిని చేపట్టి సీఎంకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి దాసరి సురేంద్రబాబు, బలిజ సంఘ నేత పామూరు కృష్ణయ్య,, పార్టీ నేతలు చొప్పా వెంకటేశ్వర్లు, గురుస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.