స్కూల్‌కెళ్లేందుకు బ్యాగ్ సర్దుకుంటూ..
బాల్కనీ నుంచి కిందపడి బాలుడి మృతి
నెల్లూరు(క్రైమ్): అంత వరకు ఉత్సాహంగా గడిపి.. పాఠశాలకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బాల్కనీలో బ్యాగ్ సర్దుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడటంతో బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన నెల్లూరు రూరల్ మండలం విజయలక్ష్మీనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల సమాచారం మేరకు.. విజయలక్ష్మీనగర్‌లోని గాయత్రి నిలయం రెండో అంతస్తులో నివాసం ఉంటున్న రాజు, సుమతి దంపతులకు వంశీకృష్ణ (15), మహేంద్ర సంతానం. సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వంశీకృష్ణ పదో తరగతి చదువుతున్నాడు.
ఈ తరుణంలో స్కూల్‌కు వెళ్లేందుకు బాల్కానీలో బ్యాగ్‌ను సర్దుకుంటుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి కింద మట్టి రోడ్డుపై పడ్డాడు. గమనించిన వాచ్‌మెన్.. రాజుకు తెలియజేయడంతో ఆయన కిందకొచ్చి అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడ్ని చికిత్స నిమత్తం కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. ఈ మేరకు వేదాయపాళెం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు రోదన చూపరులను కంటతడి పెట్టించింది.