
డయాలసిస్ రోగుల ఇబ్బందులు
● విద్యుత్ సరఫరాలో
అంతరాయంతో పాట్లు
● జనరేటర్ లేక అవస్థలు
పొదలకూరు: డయాలసిస్ సెంటర్‌కు వచ్చిన రోగులు మంగళవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డయాలసిస్ జరుగుతున్న సమయంలో సుమారు మూడుగంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పొదలకూరు సీహెచ్‌సీలో 8 బెడ్స్ ఉండగా డయాలసిస్ చేయించుకునేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రక్రియ జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే రోగుల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని టెక్నీషియన్లు వెల్లడిస్తున్నారు. పట్టణంలో ట్రాన్స్‌ఫార్మర్ సమస్య ఉందని విద్యుత్ అధికారులు గంటల సమయం సరఫరాను నిలిపివేశారు. సెంటర్ పర్యవేక్షణను రహీ కేర్‌కు కేటాయించారు. జనరేటర్ లేకపోవడంతో తరచూ సమస్యలు వస్తున్నాయి. థర్ట్ పార్టీ సంస్థ జనరేటర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందా? లేక కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందా? అనేది స్పష్టత లేదు. దీంతో విద్యుత్ అంతరాయాల సమయంలో రోగులు నరకం అనుభవిస్తున్నారు.