
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
● కాలువ వద్ద ఒరిగిపోయిన బస్సు
● బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో?
సోమశిల: రోడ్లను అభివృద్ధి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. దారుణంగా ఉన్న రహదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోమశిల గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. మంగళవారం ఉదయం సోమశిల నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కొంతకాలం క్రితం ప్రాజెక్ట్ సమీపంలోని పరమానందయ్య ఆశ్రమం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. పక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. ఇక్కడ సరిపడినంత మార్జిన్ లేకపోవడంతో అటుగా వెళుతున్న బస్సు కాలువ వద్ద ఒరిగిపోయింది. ఆ సమయంలో 20 మందికి పైగా ప్రయాణికులుండగా డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. ఇటీవల ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ కాలువలో పడగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు త్వరతరగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.