
సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మాధవి
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ కొండేటి మాధవిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్‌గా పనిచేసిన డాక్టర్ సిద్ధానాయక్ జూన్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాధవిని తాత్కాలికంగా ఇన్‌చార్జిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది. అప్పటి నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పదోన్నతి కల్పించి రెగ్యులర్ విధానంలో నియమించారు. నిజాయితీగా పని చేస్తారనే పేరున్నా ఇప్పటి వరకు ఆమె ఇన్‌చార్జిగా ఉండటంతో ఆస్పత్రి పరిపాలనలో తనదైన ముద్ర వేయలేకపోయారు. కొందరు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, గంటో, రెండు గంటలో పని చేసి తప్పించుకుని తిరుగుతున్నా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారని ప్రచారం జరిగింది. స్కానింగ్, ఎక్స్‌రే, రక్తపరీక్షల వద్ద రద్దీగా ఉండటం, సకాలంలో పరీక్షలు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రెగ్యులర్‌గా నియమించడంతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
యువతి అదృశ్యం
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.