
భాగస్వామ్య పార్టీ నేతకే ద్రోహమా..?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ మహిళా నేత, ప్రముఖ వైద్యడు అంజనీకుమార్ సతీమణి రాజేశ్వరమ్మకు జరిగిన అన్యాయంపై అనేక సంఘాలు ఇప్పటికే మద్దతు పలికాయి. జిల్లా బలిజ సంఘాలు సైతం మంగళవారం నెల్లూరులో సమావేశమై రాజేశ్వరమ్మకు బాసటగా నిలిచాయి. అవసరమైతే చలో అమరావతి సైతం చేపడతామని ప్రకటించారు. పొదలకూరు మండలం మరుపూరులో కే రాజేశ్వరికు చెందిన సొంత భూమిలో టేకు చెట్లను టీడీపీ నేతలు అక్రమంగా నరికి దుంగలను తరలించిన రూ.లక్షలు సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకుల నిర్వాకంపై రాజేశ్వరమ్మ ఎమ్మెల్యే సోమిరెడ్డి వద్ద పంచాయితీ పెట్టినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దీంతో ఆమె గత నెల 26న పొదలకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో బలిజ సంఘాల నాయకులు రంగంలోకి దిగారు.
వంద టేకు చెట్ల నరికివేత
పొదలకూరు మండలం మరుపూరులో 637–3, 637–4, 639–1, 639–2, 640–1, 640–2 సర్వే నంబర్లలో రాజేశ్వరమ్మకు 20.98 ఎకరాల భూమి ఉంది. ఈ పొలంలో ఉన్న వంద టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రూ.లక్షలు విలువైన టేకు చెట్లను టీడీపీ నేతలు కొట్టేసినట్లు గుర్తించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆమె అభిమానులు, సామాజిక వర్గానికి చెందిన వారు, బీజేపీ, జనసేన కార్యకర్తలు స్పందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతూనే ఉన్నారు.
నేడు మరుపూరుకు..
జిల్లా బలిజ సంఘాల నాయకులు కత్తిర మల్లిసిరి శ్రీనివాసులు, నాగిశెట్టి మురళీ బృందం మరుపూరు సమీపంలో రాజేశ్వరమ్మకు చెందిన తోటలో టేకు చెట్లను నరిన ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. తమ ఆడపడుచుకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఎంత దూరమైన వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించారు. అటవీశాఖ అనుమతి లేకుండా టేకు చెట్ల ను ఎలా నరుకుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలో కొనసాగుతున్న రాజేశ్వరమ్మ పొదలకూరు పోలీస్‌స్టేషన్లో రాత పూర్వకంగా గత నెలలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. స్థలం పత్రాలను పోలీసులు అడుగుతున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ మహిళా నేత రాజేశ్వరమ్మకు బలిజ సంఘాల మద్దతు
వంద టేకుచెట్లు అక్రమంగా నరికివేత
రూ.లక్షలు విలువైన కలపను
అమ్ముకున్న వైనం
ఎమ్మెల్యే సోమిరెడ్డి వద్ద తెగని పంచాయితీ
పోలీసులకు ఫిర్యాదు చేసినా
స్పందన కరువు
నేడు మరుపూరు తోట సందర్శనకు రాక