
అవినీతిలో నెల్లూరు కార్పొరేషన్ నంబర్ వన్
● ఆనం వెంకటరమణారెడ్డి
నెల్లూరు (బారకాసు): సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్‌మర్మత్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ ఆక్వా అథారిటీ బోర్డు చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ మంగళవారం ప్రస్తుత కమిషనర్‌తో మాట్లాడిన అనంతరం విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పలు భవంతులు, అపార్ట్‌మెంట్ల మార్ట్ గేజ్ ప్రక్రియలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో అవినీతిలో నెల్లూరు కార్పొరేషన్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.
అవినీతిపై విచారణకు హైకోర్టు ఆదేశాలు
కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై తాను హైకోర్టును ఆశ్రయించడంతో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ ఆనంద్‌ను ఆదేశించిందన్నారు. నెల్లూరు నగరంలో 74 భవంతులకు సంబంధించి ఆక్యూపెన్సీ స ర్టిఫికెట్లు ఇతర ధ్రువ పత్రాలు లేకున్నా వాటిని రిలీజ్ చేశారన్నారు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్‌మర్మత్‌తోపాటు చెన్నుడు హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులే చెబుతుంటే మరలా ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశించారో తనకు అర్థంకావడం లేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగకుండానే గత కమిషనర్‌గా ఉన్న హరిత బిల్లులు చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయం కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.