ఆదుకోండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

ఆదుకోండి సారూ..

Sep 2 2025 3:17 PM | Updated on Sep 2 2025 3:17 PM

ఆదుకో

ఆదుకోండి సారూ..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

436 వినతుల అందజేత

సాయం కోసం పలువురి వినతి

నెల్లూరు రూరల్‌: అయ్యా.. నా బిడ్డకు పింఛన్‌ పెంచి ఆదుకోండని ఒకరు.. ఆపరేషన్‌ చేయించేందుకు డబ్బుల్లేవని, సాయం చేయాలని మరొకరు.. ఇలా ఎంతోమంది వివిధ సమస్యలపై వినతులందించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌, ఇన్‌చార్జి డీఆర్వో విజయ్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 174, మున్సిపల్‌ శాఖవి 41, సర్వేవి 18, పంచాయతీరాజ్‌ శాఖవి 38, పోలీసు శాఖవి 62, సివిల్‌ సప్లయ్స్‌వి 11 తదితరాలు కలిపి 436 అర్జీలను ప్రజలు అందజేశారు.

దొంగ పట్టాలు సృష్టించి ప్లాట్లు వేశారు

టీడీపీ కార్పొరేటర్‌ భర్త అరవ శ్రీనివాసులు దొంగ పట్టాలు సృష్టించి ప్లాట్లు వేసి అమ్ముతున్నారని 24 డివిజన్‌ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఉడతా మురళి యాదవ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ కలూరుపల్లి గ్రామంలో 75 ప్లాట్లు వేసి ఒక్కొక్కటి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు భూమిలో ఉంచిన బోర్డులను తీసేశారన్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు అర్జీలిచ్చినట్లు చెప్పారు. ఇంత వరకు స్పందన లేదన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయం చేయాలని విన్నవించి..

కొందరు వ్యక్తులు తప్పుడు కుల ధ్రువీకరణపత్రం పెట్టి తనకు రావాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టు తీసుకున్నారని సంగం మండలం గాంధీ జనసంగం గ్రామస్తుడు మేంద్రగుత్తి మధుబాబు వినతిపత్రమిచ్చాడు. తనకు డీఎస్సీలో 235 ర్యాంక్‌ వచ్చిందన్నారు. తప్పుడు పత్రాలతో కొందరు ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగాలకు అర్హత పొందారన్నారు. న్యాయం చేయాలని కోరాడు.

పింఛన్‌ పెంచాలంటూ..

ఈమె పేరు షేక్‌ షకియా. పుట్టినప్పటి నుంచి సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. పెన్షన్‌ వస్తోంది. రూ.15,000 పెన్షన్‌ కోసం పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. బయోమెట్రిక్‌ పనిచేయకపోవడంతో ప్రస్తుతం రూ.6,000 అందుతోంది. ఇటీవల ఆమె తండ్రి మరణించాడు. నెల్లూరు రామకోటి నగర్‌లో ఉంటున్న తల్లి ఆయేషా మళ్లీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. భర్త ఉన్నప్పుడు ఎలాగోలా నెట్టుకొచ్చామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఆధార్‌ అప్‌డేట్‌ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, అధికారులు స్పందించాలని కోరింది.

సహాయం చేయండి

నా బిడ్డ తలలో నీరు గడ్డలున్నాయని, ప్రాణం కాపాడాలని ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఆదిపూడి వెంకటరమణమ్మ వినతిపత్రం సమర్పించారు. ఆమె వివరాలు వెల్లడించారు. రుయా హాస్పిటల్‌కు పాపను రెండుసార్లు తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలు చేసి నీరుగడ్డలు ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు ఆపరేషన్‌ ఇప్పుడు చేయట్లేదని, నెల్లూరులోనే నారాయణ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలన్నారు. అక్కడికెళ్తే డాక్టర్లు రూ.75,000 ఖర్చవుతుందన్నారు. తమది నిరుపేద కుటుంబమని, అంత డబ్బు కట్టలేమని, పాపను రక్షించాలని ఆమె కోరుతోంది.

ఆదుకోండి సారూ..1
1/2

ఆదుకోండి సారూ..

ఆదుకోండి సారూ..2
2/2

ఆదుకోండి సారూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement