లాభాలు వస్తాయని.. నమ్మించి మోసం | - | Sakshi
Sakshi News home page

లాభాలు వస్తాయని.. నమ్మించి మోసం

Sep 2 2025 3:17 PM | Updated on Sep 2 2025 3:17 PM

లాభాలు వస్తాయని.. నమ్మించి మోసం

లాభాలు వస్తాయని.. నమ్మించి మోసం

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు

79 ఫిర్యాదులు

సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త : ఏఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): లాభాలు వస్తాయని నమ్మించి.. పెట్టుబడి పెట్టించి మోసం చేశారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 79 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య మాట్లాడుతూ ఇంటర్నెట్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఏఎస్పీ ఆయా ప్రాంత పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు, లీగల్‌ అడ్వైజర్‌ టి.శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని...

● మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో కీర్తీ అనే మహిళ పరిచయమైంది. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్‌ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి రూ.14.50 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఆదాయం రాకపోవడంతో విచారించగా నకిలీ పోర్టల్‌ అని తేలింది. ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. విచారించి న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.

● ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళ పరిచయమైంది. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె మాటలు నమ్మి రూ.50 లక్షలు వరకు పెట్టి మోసపోయానని కావలి రెండో పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

● నా తమ్ముడిని టిప్పర్‌ ఢీకొనడంతో తీవ్రగాయాలై మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.

● పెద్ద కుమార్తె ప్రమీల, ఆమె భర్త జీవనోపాధి కోసం నా వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వెంకటాచలం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు వినతిపత్రం ఇచ్చాడు.

● నా కుమార్తె నెలరోజులుగా కనిపించడం లేదు. ఆచూకీ కనుక్కుని అప్పగించాలని దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు.

● నా భర్త వేధింపులు తట్టుకోలేక బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసును విత్‌డ్రా చేసుకోవాలని లేకుంటే అంతు చూస్తానని భర్త బెదిరిస్తున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement