
పాత పద్ధతిలోనే ఎఫ్‌సీలివ్వాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పాత పద్ధతిలోనే ఇవ్వాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో ఆటో, మినీలారీ, అంబులెన్స్, ట్రక్ అండ్ గూడ్స్ యూనియన్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ ఫెడరేషన్ జిల్లా బాధ్యుడు సురేష్ మాట్లాడుతూ సెన్సార్ పద్ధతి ద్వారా ఎఫ్‌సీ ఇచ్చే విధానం వల్ల వాహన యజమానులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఉదయగిరి, సీతారామపురం, కందుకూరు, రాపూరు తదితర మండలాలకు చెందిన వాహనదారులు సర్టిఫికెట్ల కోసం 100 కిలోమీటర్ల దూరంలో ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ ట్రాక్ వద్దకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఆదాయాన్ని తీసుకొచ్చేలా ఈ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆరోపించారు. సమావేశంలో పలు యూనియన్ల నాయకులు రాజా, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, శివకుమార్, విజయ్, జిలానీ, సుధాకర్, రవీంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు.