తమ్ముళ్ల బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల బరితెగింపు

Sep 1 2025 9:48 AM | Updated on Sep 1 2025 10:07 AM

తమ్ము

తమ్ముళ్ల బరితెగింపు

లారీల్లో ఇసుక తరలింపు

ప్రకృతి వనరులను కొల్లగొట్టడంలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపు హద్దులుదాటుతోంది. వాస్తవానికి ఇసుక తవ్వకాలపై అక్టోబర్‌ 15 వరకు నిషేధమున్నా, ఇదేమీ వారిని ఆపలేకపోతోంది. అధికారం ఉందనే ధీమాతో చెలరేగిపోతూ పెన్నాలో దర్జాగా రోడ్డును నిర్మించారు. ప్రవాహానికి అది కొట్టుకుపోవడంతో కొద్ది రోజులు మౌనంగా ఉండి.. ఆపై గ్రావెల్‌, బండ రాళ్లతో పక్కాగా ఏర్పాటు చేసుకొని తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ రకంగా వ్యవహరిస్తున్నా, చోద్యం చూడటం అధికారుల వంతవుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. కలువాయి మండలంలో జరుగుతున్న ఈ తంతు వీరి ఆగడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ భూ, ఇసుక, గ్రావెల్‌ మాఫియా పేట్రేగిపోతోంది. సహజ సంపదను అక్రమంగా రవాణా చేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు.

పండగ వేళ..

ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవాల్లో ఉన్న సమయంలో కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని పెన్నా పరిధిలో ఇసుక మాఫియా తమ పనిని సజావుగా కానిచ్చేందుకు ఏకంగా రోడ్డునే నిర్మించింది. రాపూరు మండలం తెగచర్ల నుంచి భారీగా గ్రావెల్‌, బండ రాళ్లను ఇక్కడికి తోలి.. పైపులతో దారిని ఏర్పాటు చేయడంపై స్థానికులు భగ్గుమంటున్నారు.

కొద్ది రోజులు నటన

నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్డు ఇటీవల కొట్టుకుపోయింది. అయితే మీడియాను పక్కదోవ పట్టించేందుకు పనులను ఆపేసినట్లు.. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు సీజ్‌ చేశారనే రీతిలో వ్యవహరించి ఆపై తమ పనులను యథావిధిగా చేపట్టారు. రాజుపాళెంలో అక్రమ రీచ్‌ ఏర్పాటుకు ఓ ప్రైవేట్‌ వ్యక్తి మామిడి తోట నుంచి డీపీ – 1 కాలువను పూడ్చేసి మరీ రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని చకచకా చేపట్టడం వెనుక అధికారుల హస్తం ఉందని సమాచారం.

ఆదేశాలు బేఖాతర్‌

జిల్లాలో ఇసుక రీచ్‌లకు అనుమతులను అక్టోబర్‌ 15 వరకు అధికారులు రద్దు చేశారు. అయితే వీరి ఆదేశాలను బేఖతార్‌ చేస్తూ రాజుపాళెం రీచ్‌లో అక్రమ రవాణాకు అన్నీ సిద్ధం చేశారు. గ్రావెల్‌, బండరాళ్లను పట్టపగలు దర్జాగా తోలుతున్నా పట్టించుకోకుండా, రెవెన్యూ, మైనింగ్‌ పోలీస్‌, ఇరిగేషన్‌ శాఖలు అక్రమార్జనలో భాగస్వాములయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మళ్లీ ఇసుక దోపిడీ

పెన్నాలో దర్జాగా రోడ్డు నిర్మాణం

ప్రవాహానికి కొట్టుకుపోవడంతో

కొద్ది రోజులు విరామం

తాజాగా గ్రావెల్‌, బండ రాళ్లతో పక్కాగా ఏర్పాటు

అక్టోబర్‌ 15 వరకు తవ్వకాలపై నిషేధమున్నా.. ప్రయోజనమేదీ..?

అధికారుల తీరుపై విస్మయం

యంత్రాల ద్వారా కాకుండా కూలీలతో పెన్నా నుంచి ఇసుక పూడికతీత అని అధికారులు టెండర్లు పిలిచి అనుమతులిచ్చారని తెలిసింది. సంగం బ్యారేజీలో పూడికతీత పనులకు టెండర్లను సోమశిలకు దగ్గరగా ఉండే రాజుపాళెంలో ఎలా పిలిచారో అధికారులకే అర్థం కావాలి. ఇసుకను కూలీలే బయటకు తీసి, వాహనాల్లో ఎలా లోడ్‌ చేస్తారో వారికే ఎరుక. అధికారుల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది.

తమ్ముళ్ల బరితెగింపు 1
1/1

తమ్ముళ్ల బరితెగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement