
ప్రభుత్వ భూములు హాంఫట్
● జామాయిల్ మొక్కలు నాటి..
సొంతం చేసుకుంటున్న కబ్జాదారులు
● అధికారులకు విన్నవించినా
స్పందన శూన్యం
మర్రిపాడు: మర్రిపాడులోని ప్రతి గ్రామంలో వందలెకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. ఇంకేముంది కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీరి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. మండల పరిధిలోని పెగళ్లపాడు రెవెన్యూలో 82, 83, 84 నుంచి 113 వరకు ఉన్న ససర్వే నంబర్లలో దాదాపు వందెకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మాయపల్లికి చెందిన కొందరు జామాయిల్ సాగు చేసుకునేందుకు గానూ కొన్ని ఆన్‌లైన్ పట్టాలు.. మరికొన్ని నకిలీ పట్టాలతో వీటిని కబ్జా చేసేందుకు జేసీబీ ద్వారా చెట్లను తొలగిస్తున్నారు. జామాయిల్‌ను వారం రోజులుగా సాగు చేస్తున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే తరహాలో..
మండలంలోని చుంచులూరు రెవెన్యూ పరిధిలో కొత్తపల్లి పాత రోడ్డును ఆనుకొని తారు రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబర్ 39, 41లో విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా విలువ రూ.ఐదు లక్షలకుపైగానే ఉంటుంది. రాజకీయ పలుకుబడి ఉన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ భూమికి పక్కనే కొంత భూమికి అసైన్‌మెంట్ పట్టా పొందారు. తాజాగా దీని పక్కనే ఉన్న సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి జేసీబీలతో ముళ్ల చెట్లను తొలగించి, చదును చేసి జామాయిల్ మొక్కలు నాటారు. విషయం తెలుసుకున్న పక్కనే ఉన్న 42 సర్వే నంబర్ పట్టాదారు.. 50 ఏళ్ల హక్కు అనుభవం కలిగిన రిజిస్టర్ పొలానికి దారి లేకుండా చేయడం అన్యాయమంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. మర్రిపాడులో ఇటీవల నిర్వహించిన స్పెషల్ గ్రీవెన్స్‌లో ఆర్డీఓ పావనికు అర్జీని సమర్పించారు.
ఆదేశాలు పెడచెవిన
ఈ క్రమంలో సర్వేయర్లతో సర్వేను మూడు రోజుల క్రితం తహసీల్దార్ చేయించారు. పక్కా నివేదికతో సదరు భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. 42 సర్వే నంబర్ గల సెటిల్‌మెంట్ భూమికి ప్రభుత్వ పొలంలో 20 అడుగుల దారిని కొలిచి సదరు రైతుకు ఇచ్చారు. అయితే అక్రమణలకు అలవాటుపడిన కబ్జాదారులు అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతూ ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారు. తహసీల్దార్ అనిల్‌కుమార్ ఆదేశాలను ధిక్కరిస్తూ దారి ఇక్కడ లేదంటూ అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం.. చెట్లు నాటి పక్క పొలానికి దారి లేకుండా చేయడం అన్యాయమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆత్మకూరు ఆర్డీఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ను సంప్రదించగా, పరిశీలించి చర్యలు చేపడతామని బదులిచ్చారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వ భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నారు. వీటిని చేజిక్కించుకునేందుకు ఎన్నో జిమిక్కులకు పాల్పడుతున్నారు. భూములను చదును చేయడం.. ఆపై జామాయిల్ మొక్కలు నాటడం.. అవి తమదేనంటూ బొక్కేయడం పరిపాటిగా మారింది. మండల, డివిజన్ స్థాయి అధికారులకు స్థానికులు సమాచారమిచ్చినా, వారెలాంటి చర్యలు చేపట్టడంలేదు.