క్షణం ఆలోచిస్తే.. నిలుస్తుంది ప్రాణం | - | Sakshi
Sakshi News home page

క్షణం ఆలోచిస్తే.. నిలుస్తుంది ప్రాణం

Sep 1 2025 9:48 AM | Updated on Sep 2 2025 11:52 AM

కలవరపెడుతున్న బలవన్మరణాలు

ఈ ఏడాదిలో 61 మందికి పైగా..

16 నుంచి 40 ఏళ్ల వయసున్న వారే అధికం

ఇటీవల కొన్ని ఘటనలు 

● బుజబుజనెల్లూరు వల్లూరమ్మకాలనీకి చెందిన ఓ వృద్ధుడు అప్పులపాలై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.

● గుర్తుతెలియని వ్యక్తి వందేభారత్‌ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

● నెల్లూరు డ్రైవర్స్‌ కాలనీలో అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

● బీవీనగర్‌లో ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకున్నాడు.

● మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

నెల్లూరు(క్రైమ్‌): జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్నచిన్న సమస్యలకూ కుంగిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్నెన్నో బంధాలను పెనవేసుకున్నా.. అన్నింటిని తుంచేసుకుని నా అనుకున్న వారిని నట్టేట వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోతున్నారు. జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవన వేగం జోరందుకోవడంతోపాటు అంతే స్పీడుగా ప్రజల్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం, ఉద్యోగం రాలేదని, రుణ, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో బంధాలను చిదిమేస్తున్నాయి. 

ఆలోచన శక్తి కలిగి ఉండి తనకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమార్గాలు కనుగొనే అవకాశం ఉన్నా చిన్నచిన్న విషయాలకే మనోధైర్యాన్ని కోల్పోతూ ప్రాణాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన మిగులుస్తున్నారు. కొన్ని కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి చిన్నాభిన్నమవుతుంటే.. మరికొన్ని ఇళ్లలో చేతికందొచ్చిన కొడుకు తనువు చాలించి పోషణ కరువవడం, మరోచోట భర్తను కోల్పోయి భార్యాపిల్లలు అనాథలవడం, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు చదువుల్లో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం వంటి ఘటనలు కలవరపెడుతున్నాయి.

గుర్తుచేసుకుని..

సమస్య ఏదైనా ఓర్పుగా పరిష్కారం వైపు అడుగులు వేయాలే తప్ప భయపడి ఆత్మహత్యలకు పాల్పడితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో గ్రహించాలి. అనుబంధాలు, ఆత్మీయతలను ఒక్కసారి గుర్తుచేసుకుని క్షణంపాటు ఆలోచించినా జీవితాన్ని అలవోకగా జయించవచ్చని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 61 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో 16 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న వారే ఎక్కువగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement