సిండికేట్‌ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

సిండికేట్‌ సక్సెస్‌

Aug 31 2025 1:17 AM | Updated on Aug 31 2025 1:17 AM

సిండికేట్‌ సక్సెస్‌

సిండికేట్‌ సక్సెస్‌

జిల్లాలో 55 బార్లకు నోటిఫికేషన్‌

21 బార్లకే నామమాత్రంగా దరఖాస్తులు

గత్యంతరం లేక కట్టబెట్టిన వైనం

నెల్లూరు (క్రైమ్‌): బార్ల ఏర్పాటు విషయంలో సిండికేట్‌ వేసిన ప్లాన్‌ కొంత మేరకు సక్సెస్‌ అయింది. జిల్లాలో 55 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే మద్యం షాపులు, పర్మిట్‌ రూమ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వ్యాపారాన్ని కోల్పోతున్న బార్ల యజమానులు సిండికేట్‌గా మారారు. అన్ని బార్లకు దరఖాస్తులు రాకుండా కేవలం 21 బార్లకు మాత్రమే దరఖాస్తులు వేశారు. దీంతో గత్యంతరం లేక నిబంధనలు సడలించిన అధికారులు లక్కీడ్రా నిర్వహించి బార్లను కేటాయించారు. సిండికేట్‌ చర్యలతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడింది. జిల్లాలో ఓపెన్‌ కేటగిరీ కింద 50 బార్లు, గీత కులాలకు సంబంధించి ఐదు బార్లకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో బార్లన్నింటిని ఏకపక్షంగా దక్కించుకునేందుకు మద్యం సిండికేట్‌ రంగంలోకి దిగింది. దరఖాస్తులు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ వచ్చింది. మరో వైపు బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నూతన బార్‌పాలసీపై వ్యాపారులు అనాసక్తి కనబరుస్తూ దరఖాస్తులు దాఖలు కాకుండా చేశారు. దీంతో ఈ నెల 26న దరఖాస్తుల స్వీకరణ ముగిసే సమయానికి కేవలం ఐదు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం గడువును 29వ తేదీ వరకు పొడిగించింది. అయినప్పటికి దరఖాస్తుల దాఖలు నామమాత్రంగానే మారింది. దీంతో సిండికేట్‌ కొంత మేర సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది.

21 దుకాణాలకే దరఖాస్తులు.. లక్కీడ్రా

జిల్లాలో 55 బార్లకు 21 దుకాణాలకు 94 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. నెల్లూరులో 38 బార్లకు 13, కావలిలో ఏడు బార్లకు రెండు, కందుకూరులో మూడు బార్లకు రెండింటికే దరఖాస్తులు వచ్చాయి. గీత కులాలకు సంబంధించి నెల్లూరులో రెండు, కావలి, కందుకూరులో చెరో ఒక బార్‌కు దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన వాటికి దరఖాస్తులు దాఖలు కాలేదు. 21 బార్లకు శనివారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ కె.కార్తీక్‌ లక్కీడిప్‌ నిర్వహించారు. బార్లు దక్కించుకున్న వ్యాపారులు లైసెన్సు ఫీజులో ఆరో వంతు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన అనంతరం ఎకై ్సజ్‌ అధికారులు లైసెన్సులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తులు, ప్రొసెసింగ్‌ ఫీజు రూపేణా రూ.4,79,40,000, తొలి విడత లైసెన్సు ఫీజు రూపేణా రూ.2,21,29,000 మొత్తంగా రూ.7,00,69,000 ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. మిగిలిన బార్లకు ప్రభుత్వం మరో మారు రీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. లక్కీడిప్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎం.శంకరయ్య, ఏసీ పి. దయాసాగర్‌, డీపీఈఓ ఎ. శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్‌లు జే రమేష్‌, ఆర్‌. జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

నేటితో కాలపరిమితి ముగింపు

ప్రస్తుతం జిల్లాలోని 47 బార్ల కాల పరిమితి ఆగస్టు 31వ తేదీ ఆదివారం రాత్రితో ముగియనుంది. దీంతో వారం రోజుల ముందు నుంచే బార్ల నిర్వాహకులు మద్యం కొనుగోలును నిలిపివేశారు. ఉన్న అరకొర మద్యంను విక్రయిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎకై ్సజ్‌ అధికారులు వాటన్నింటికి సీల్‌ వేయనున్నారు.

రేపటి నుంచి కొత్తబార్లు

లాటరీ డ్రాలో నెల్లూరు నగరంలో గెజిట్‌ సీరియల్‌ నంబర్‌ 4, 6, 7, 9,11,12,16, 18, 28, 29, 30, 35, 36, కావలిలో 42, 45, కందుకూరులో 46, 48, గౌడ కులాలలకు సంబంధించి నెల్లూరులో రెండు, కావలి, కందుకూరులో చెరో ఒక బార్‌ను వ్యాపారులు దక్కించుకున్నారు. బార్లు దక్కించుకున్న వారిలో అధికశాతం మంది టీడీపీకి చెందిన వారే. సెప్టెంబర్‌ ఒకటి నుంచి కొత్త బార్లు ప్రారంభం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement