
రైతుకు యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు
నెల్లూరు (స్టౌన్‌హౌస్‌పేట): సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండి పడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం రైతులకు సరిపడినంత యూరియాను కూడా అందించలేని అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నాడని, ఆయనొక విజనరీ అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయశాఖ మంత్రి చూస్తే అధికారులను అడ్డం పెట్టుకుని కమీషన్లు దండుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఒక వైపు పంటలకు యూరియా దొరక్క అవస్థలు, మరో వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని దుస్థితి ఉందన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు కొనుగోలు చేస్తే 40 శాతం సబ్సిడీని వారి ఖాతాల్లో మా ప్రభుత్వం పారదర్శకంగా జమ చేసిందన్నారు. ఆర్‌బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలబడ్డామన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రి అధికారులను కమీషన్ ఏజెంట్లుగా మార్చేశాడని దుబయ్యబట్టారు. నెల్లూరులో పంట కోతకొచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు చెప్పలేదు. పుట్టి ధాన్యం రూ.19,770 ఉంటే.. దళారులు రూ.15 వేలకే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు.
ఉల్లి రైతులను పట్టించుకోరా?
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆర్తనాదాలు సీఎం చంద్రబాబుకు వినిపించడం లేదని కాకాణి విమర్శించారు. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.25 ఉంటే, ఏపీలో మాత్రం రైతుల దగ్గర కేవలం రూ.2 నుంచి రూ.4లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. మద్దతు ధర కల్పించే దిశగా చంద్రబాబు ఆలోచన చేయడం లేదు. వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వరకు ఏ ఒక్క రైతుకు మేలు జరగడం లేదని, ప్రతిపక్షంగా రైతుల తరఫున రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండడం వల్ల రైతులు ధైర్యంగా ఉండేవారన్నారు. మా ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం కూడా చెల్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఇప్పటికై నా రైతు సమస్యలపైన సీఎం చంద్రబాబు దృష్టి సారించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని, పోలవరం ప్రాజెక్ట్ జాప్యం కావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలు రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే కుప్పానికి నీళ్లు తెచ్చి ఇచ్చిన చరిత్ర అని ధైర్యంగా చెప్పుకుంటామన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని
గాలికొదిలేశారు
వ్యవసాయం దండగనే మనస్తత్వం ఆయనది
కమీషన్లు దండుకునే పనిలో ఆ శాఖ మంత్రి నిమగ్నం
కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి