
మరోసారి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
కావలి (జలదంకి): కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరంతా అవినీతిపరులు, తాను సచ్చీలుడినంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడో కొన్నేళ్ల కిత్రం నిర్మించిన ప్రతాప్‌కుమార్‌రెడ్డి కాలేజీ, కల్యాణ మండపం, ఇల్లు ఆక్రమించాడంటూ పొంతన లేకుండా మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణిని ఉద్దేశించి ‘నీవు చచ్చోడివి.కావలికి రాలేకపోయావు. పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించుకున్నావు. నీకు బొక్కలున్నాయి. వాటిని నీకు విప్పి చూపిస్తా’ అభ్యంతరకర భాషలో దూషిస్తూ ఊగిపోయాడు. దొంగతనాలు, మానభంగాలు చేయించావు. మనుషులను చంపించావు. మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో ఫైళ్లు దొంగిలించావు. కృష్ణపట్నం పోర్టు నుంచి నీ అవినీతిని బయటకు తీస్తానంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంద్రశేఖర్‌రెడ్డిని కూడా పరుష పదజాలంతో మాట్లాడాడు. చదువుల తల్లికి ప్రతినిధిగా ఉండే నీవు సంస్కారంగా ఉండాలన్నారు. నీ జీవితం, నీ కథ, నీ ఆస్తులు, నీ మానభంగాలు అన్నీ తెలుసు, 10వ తరగతి, ఇంటర్ పేపర్లలో లీకేజీలతో నీకు సంబంధం ఉందంటూ విమర్శలు గుప్పించారు.