
మా అందర్నీ జైల్లో వేయండి
ఊరొదిలెళ్లం.. ప్రభుత్వం హింసిస్తోంది సార్
సబ్ కలెక్టర్‌కు విన్నవించిన రామకృష్ణాపురం వాసులు
ఉలవపాడు: అయ్యా మేము ఊరొదిలెళ్లం.. మీ ప్రభుత్వం మమ్మల్ని హింసిస్తోంది.. పోలీసులు అర్ధరాత్రి వచ్చి భయపెట్టి అరెస్ట్ చేస్తున్నారు.. కుట్రతో జైలుకూ పంపారు.. ఈ ప్రభుత్వం చేసిన అవమానాలు చాలు.. ఇంకా ఎంతమందిని జైలుకు పంపిస్తారో పంపండంటూ రామకృష్ణాపురం మహిళలు సబ్ కలెక్టర్ హిమవంశీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రామకృష్ణాపురం, ఉప్పరపాళెంలో శనివారం పర్యటించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం మహిళలు తమ ఆవేదనను తెలియజేశారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. ఇప్పుడు వంద మంది మాట్లాడుతున్నాం.. అందర్నీ జైల్లో వేయండన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన సర్కార్ అందుకు భిన్నంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. భూములివ్వమని తెలియజేసినందుకు ఇంతలా ఇబ్బందులు పెడతారానని ప్రశ్నించారు.
సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా..
సమస్యలు తెలుసుకోవాలనే తానొచ్చానని సబ్ కలెక్టర్ తెలిపారు. ఎంత మందికి ఉద్యోగాలు అవసరమవుతాయి.. కుటుంబాల వివరాలపై సర్వే చేస్తున్నామే తప్ప భూములు తీసుకోవడానికి కాదని చెప్పారు. ఇష్టం ఉండి భూములిస్తే తీసుకుంటామని, అది వేరే సంగతని పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. మాకు సర్వేలొద్దు.. మీరు మాకేదైనా సాయం చేయాలనుకుంటే ఏమీ వద్దు.. ప్రశాంతంగా ఉన్నాం.. ఇక్కడికి వదిలేయండంటూ మహిళలు పేర్కొన్నారు.
పరిహారం తక్కువగా ఉంది..
భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారని ఉప్పరపాళెం ప్రజలు పేర్కొన్నారు. ఒక కుటుంబానికిచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, ఇలా అయితే తమ భూములు, ఇళ్లను ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.ఆరు లక్షలను ఇస్తామంటున్నారని, దీన్ని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.