
బాణసంచా ఘటన నీరుగార్చేందుకు యత్నం
● అప్పసముద్రం గ్రామస్తుల ఆందోళన
ఉదయగిరి: మండలంలోని అప్పసముద్రంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న బాణసంచా ఘటనతో ప్రమేయమున్న నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు యత్నిస్తున్నారంటూ ఆందోళనను గ్రామస్తులు శనివారం చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ఒత్తిడి తెచ్చి నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నడింపల్లికి చెందిన టీడీపీ నేత మద్దినేని విజయమ్మ.. ఎమ్మెల్యేకు సమీప బంధువు కావడంతో బాణసంచా ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు చూస్తున్నారని తెలిపారు. గ్రామంలో కొన్నేళ్లుగా మద్యం విక్రయాలను విజయమ్మ సాగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవడంతో మనస్సులో పెట్టుకొని అధికార పార్టీ అండదండలతో తమపై వేధింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నిమజ్జన సమయంలో బాణసంచా పేల్చొద్దని కోరినా, ఆమె ప్రోద్బలంతో కాల్చడంతో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. గాయపడిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారిందని, శరీరమంతా కాలిపోయి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనను ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకొని, ప్రమేయమున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. కేసు నీరుగార్చేందుకు విజయమ్మ సమీప బంధువు వెంకట్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. వీరి శరీర భాగాలు చాలా వరకు కాలిపోయాయి.

బాణసంచా ఘటన నీరుగార్చేందుకు యత్నం

బాణసంచా ఘటన నీరుగార్చేందుకు యత్నం