
లేడీ డాన్‌గా చిత్రీకరించారు
● దందాలు, నేరాలతో సంబంధాల్లేవు
● ముగిసిన అరుణ పోలీస్ కస్టడీ
● ఒంగోలు జైలుకు తరలింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: నేనో సాధారణ మహిళను.. నేరాలతో నాకెలాంటి సంబంధం లేదు.. లేడీడాన్ అంటూ మీడియా చిత్రీకరించింది.. అన్ని సక్రమంగా జరిగి ఉంటే శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకొని హాయిగా జీవించే వాళ్లం.. మా బాగోగులన్నీ అధికార పార్టీ నేతలే చూసుకునే వారని పోలీస్ కస్టడీలో అరుణ వెల్లడించారని తెలిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా కేంద్ర కారాగారం నుంచి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు ఆమెను పోలీసులు శనివారం తరలించారు. ఎస్పీ కృష్ణకాంత్, ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్, ఒంగోలు డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, రాయపాటి శ్రీనివాసరావు అనేక ప్రశ్నలను సంధించగా, ఎక్కువ సమాధానాలను దాటేశారని తెలుస్తోంది. ఆమె గతం, ప్రస్తుతం, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ నేతలు, అధికారులతో సంబంధాలు, శ్రీకాంత్‌తో ఉన్న అనుబంధం, అతని గ్యాంగ్‌తో ఏమైనా నేరాలు చేశారా.. ఇలా పలు విషయాలపై ఈ మూడు రోజుల్లో దాదాపు 90 ప్రశ్నలు సంధించారని సమాచారం. తన చెల్లెలు ఓ విద్యాసంస్థలో ఏఓగా పనిచేస్తున్నారని, ఆమెకు వస్తున్న జీతం, తనకు కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తితోనే బతుకుతున్నామని ఆమె వెల్లడించారని తెలిసింది. ప్రకాశం జిల్లాలో జరిగిన వీరయ్యచౌదరి హత్య కేసు నిందితుల్లో ఏమైనా సంబంధాలున్నాయానని ప్రశ్నించారని తెలుస్తోంది. జగదీష్ విషయంలో సామాజికవర్గంతో భేదాభిప్రాయాలొచ్చాయని చెప్పారని తెలిసింది. అనేక ప్రశ్నలకు సమాధానం దాటేయడంతో, కస్టడీకీ మరోసారి ఆమెను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మూడు రోజుల విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని నెల్లూరు రూరల్ డీఎస్పీ వెల్లడించారు. పోలీస్ కస్టడీ శనివారం సాయంత్రంతో ముగియడంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఆమెను ఒంగోలు కేంద్ర కారాగారానికి తరలించారు.