
అస్తిత్వవాద సాహిత్యంపై సదస్సు
నెల్లూరు(బృందావనం): వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని నగరంలోని పురమందిరంలో తెలుగు భాషోత్సవాలను సేవ తెలుగు భాషా, సాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అస్తిత్వవాద సాహిత్యంపై సదస్సును రెండో రోజు శనివారం నిర్వహించారు. సభకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రచించిన బహుజనగణమన వచన కావ్యాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడారు. సామాజిక న్యాయ ప్రాతిపదికన దేశాన్ని శాంతియుత పద్ధతుల్లో పునర్నిర్మించడమే అస్తిత్వ ఉద్యమాల లక్ష్యమని చెప్పారు. కథా రచయిత్రి ప్రతిమ, డాక్టర్ షమీవుల్లా, డాక్టర్ జయప్రద, సేవ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు, డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు, డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ తదితరులు గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలువురు కవులతో కవితోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు సాహిత్య సౌరభాలు సాహితీ రూపకాన్ని ప్రదర్శించారు. మహిళా సదస్సును ఏర్పాటు చేశారు.