
లారీ చక్రాల కింద నలిగిన ప్రాణం
● హమాలీ మృతి
కొడవలూరు: లారీ చక్రాల కింద నలిగి గిరిజన హమాలీ మృతి చెందిన ఘటన మండలంలోని చంద్రశేఖరపురం వేర్ హౌస్‌ల వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. చంద్రశేఖరపురంలోని గిడ్డంగుల్లో హమాలీగా మండలంలోని కమ్మపాళెం మజరా గుర్రాలదిన్నెకు చెందిన యాకసిరి శ్రీనివాసులు (50) పనిచేస్తున్నారు. గిడ్డంగుల్లో లారీకి లోడింగ్ ఉందనే సమాచారంతో ఇంటి నుంచి మోపెడ్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఖాళీ లారీ మరో వరుసలోకి మారే క్రమంలో వేగంగా వస్తూ మోపెడ్‌ను ఢీకొంది. కిందపడిన ఆయనపై లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటిరెడ్డి ఘటన స్ధలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.