మా బాధలు వినండయ్యా.. | - | Sakshi
Sakshi News home page

మా బాధలు వినండయ్యా..

Jul 29 2025 9:09 AM | Updated on Jul 29 2025 9:09 AM

మా బా

మా బాధలు వినండయ్యా..

నెల్లూరు రూరల్‌: నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కె.కార్తీక్‌, డీఆర్వో హుస్సేన్‌ సాహెబ్‌, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి వినతిపత్రాలను స్వీకరించారు. మొత్తం 450 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ శాఖవి 160, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌వి 52, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌వి 32, పంచాయతీరాజ్‌వి 36, స్కూల్‌ ఎడ్యుకేషన్‌వి 25, పోలీస్‌ శాఖవి 43 తదితర శాఖలవి వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వినతులు పరిష్కరించే విషయంలో కొన్ని శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవినీతి బయటపెట్టానని వేధింపులు

వెలుగు సీసీ, ఏపీఎంల అవినీతి బయట పెట్టినందుకు ఉద్యోగం చేయకుండా అడ్డుకుంటున్నారని రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వీఓఏ నాగమణి వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ మండలంలో గిరిజన ఉన్నతి నిధులు సుమారు రూ.కోటి వరకు దోచుకున్న సంగతి బయట పెట్టానన్నారు. ప్రస్తుత ఏపీఎం చంద్రశేఖర్‌ ద్వారా తనను విధులకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే లెటర్‌ తెస్తేనే ఆఫీసులోకి అడుగుపెట్టాలని అంటున్నారని తెలిపారు. ఇతర శాఖలోని అధికారుల చేత విచారణ చేయించాలని కోరారు.

తప్పుడు కేసు పెట్టించారు

కారు ట్రావెల్స్‌ బిజినెస్‌లో మా అన్నయ్యను మోసం చేసి తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల గ్రామానికి చెందిన మౌనిష్‌ శర్మ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అన్నను మోసగించిన కోటగుంట శ్రీకాంత్‌, షబ్బీర్‌ అనే వ్యక్తులు షేక్‌ కాలేషా అనేవారు టీడీపీ మైనార్టీ లీడర్‌తో కలిసి అక్రమ కేసులు బనాయించారన్నారు. తన అన్నయ్య ఆత్మహత్యాయత్నం చేశాడని, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆత్మహత్య శరణ్యమన్నారు.

పొలం ఆక్రమించేందుకు యత్నం

కలువాయి మండలం తోపుగుంట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 461లోని 1.60 ఎకరాల భూమిని టీడీపీ నేతలు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేయలేదని కక్షగట్టి ఇండ్ల చెంచయ్య ద్వారా తన భూమిని ఆక్రమించుకోవాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని వాపోయారు. పొలాన్ని దున్ని నిమ్మ మొక్కలను నాటారని, అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదన్నారు.

సంక్షేమ నిధిని పునఃప్రారంభించాలంటూ..

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రారంభించాలని ఏపీ బిల్డర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ ముక్తియార్‌, గౌరవాధ్యక్షుడు కె.ఆంజనేయులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రసూతి, అనారోగ్యం, అంగవైకల్యం, మరణాలకు సంబంధించిన 40 వేలకు పైగా క్లెయిమ్స్‌ చెల్లింపు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో రూ.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలి

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సివిల్‌ సప్లయ్స్‌ ద్వారా కొనుగోలు చేయించాలని టీడీపీ రైతు విభాగం ప్రధాన వెంకటేశ్వర్లు కోరారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్‌ ఉన్నతాధికారులు, రైతు సంఘం, రైస్‌మిల్‌ అసోసియేషన్‌ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు

450 వినతులు

వీఆర్‌ఏల ధర్నా

పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌

ఖాళీగా ఉన్న వీఆర్వో, అటెండర్‌, వాచ్‌మెన్‌, రికార్డు అసిస్టెంట్‌, డ్రైవర్‌ పోస్టులను వీఆర్‌ఏలతో భర్తీ చేయాలంటూ కలెక్టర్‌ ఎదుట ధర్నా జరిగింది. ఇందులో వీఆర్‌ఏలు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. వీఆర్‌ఏలపై పనిభారం ఎక్కువైందన్నారు. దీనిని తగ్గించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్‌ వాచ్‌మెన్‌, ఇసుక డ్యూటీలు రద్దు చేయాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్‌ ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. నేతలు వి.లచ్చయ్య, జి.ఓబులేశు తదితరులు పాల్గొన్నారు.

మా బాధలు వినండయ్యా..1
1/1

మా బాధలు వినండయ్యా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement