
బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం
సోమశిల: అనంతసాగరం మండలంలోని పడమటికంభంపాడు గ్రామంలో ట్రాక్టర్ తొక్కించడంతో మాణికల నాగరాజు (7) అనే బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం తహసీల్దార్ జయరాజవర్దన్, సోమశిల ఎస్సై అనూష వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గ్రామంలో విచారించిన అనంతరం మృతదేహాన్ని గుర్తించేందుకు బాలుడి కుటుంబ సభ్యులతో పెన్నానది వద్దకు వెళ్లారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు ఖదీర్ పోస్టుమార్టం నిర్వహించారు.
హత్య చేసి.. ఆత్మహత్యగా ప్రచారం
● భర్త మృతిపై భార్య అనుమానాలు
నెల్లూరు(క్రైమ్): తన భర్త తరుణ్‌తేజ మృతిపై పలు అనుమానాలున్నాయని భార్య ప్రవళ్లిక వాపోయారు. తరుణ్ మృతదేహానికి జీజీహెచ్ వైద్యులు సోమవారం శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
ఆర్‌ఐఈ భవనాలకు భూమి పూజ నేడు
నెల్లూరు(టౌన్): రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) సంస్థ భవనాలకు మంగళవారం భూమిపూజ నిర్వహించనున్నారు. గతంలో వెంకటాచలం మండలం చౌటపాళెం గ్రామంలో ఆర్‌ఐఈ సంస్థను నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌటపాళెంలో 50 ఎకరాల్లో రూ.900 కోట్లతో భవన సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మాణాలు రానున్న మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. తొలుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా భూమిపూజ చేయాలని నిర్ణయించినప్పటికీ అనివార్య కారణాలతో ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఓఎస్‌డీ, ప్రొఫెసర్లు తదితరులు పూజలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆర్‌ఐఈ సంస్థకు సంబంధించి తరగతులను వీఆర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.
కండలేరులో 27.010 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 27.010 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,975, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.