
సోదరికి మాత్రలు తీసుకెళ్తుండగా..
● ట్రావెల్స్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కావలి(జలదంకి): విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్వీకేబీటీ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కావలి మండలం చెంచుగానిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలి మండలం ముసునూరు అరుంధతీయ కాలనీలో పోతిపోక రవి (38) ఉంటున్నాడు. బీటెక్ వరకు చదివాడు. ఓవైపు పోటీ పరీక్షలు రాస్తున్నాడు. మరోవైపు కుటుంబ జీవనం కోసం సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. అతని సోదరి బుజ్జమ్మ గౌరవరంలో నివాసం ఉంటోంది. బుజ్జమ్మకు ఆరోగ్యం బాగోలేదు. మాత్రలు, కొబ్బరినీరు తెమ్మని రవికి ఫోన్ చేసి చెప్పింది. అతను అవి తీసుకుని మోటార్‌బైక్‌పై గౌరవరానికి బయలుదేరాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రవి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేశారు.