కన్నవారిపై కనికరం లేకుండా.. | - | Sakshi
Sakshi News home page

కన్నవారిపై కనికరం లేకుండా..

Jul 29 2025 9:09 AM | Updated on Jul 29 2025 9:09 AM

కన్నవారిపై కనికరం లేకుండా..

కన్నవారిపై కనికరం లేకుండా..

తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న

సంతానం

పోలీసులకు వృద్ధుల ఫిర్యాదులు

నెల్లూరు(క్రైమ్‌): ‘కడుపున పుట్టిన వారు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. మా బాగోగులు పట్టించుకోకుండా హింసిస్తున్నారు’ ఇదీ పలువురి తల్లిదండ్రుల ఆవేదన. ప్రతి సోమవారం నెల్లూరులో పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు వచ్చి సంతానం పెడుతున్న ఇబ్బందులపై కన్నీటిపర్యంతమై వినతులు అందిస్తున్నారు. ఈ సోమవారం కూడా పలువురు వచ్చారు. తన కుమారుడు మద్యం మత్తులో చిత్రహింసలు పెడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కోరాడు. నా భర్తకు పక్షవాతం. నా కాలుకు ఆపరేషన్‌ జరిగింది. ఇద్దరు కుమారులు మా బాగోగులు పట్టించుకోవడం లేదు. పూటగడ వని దయనీయ స్థితిలో ఉన్నాం. విచారించి న్యాయం చేయాలని కొడవలూరుకు చెందిన ఓ వృద్ధురాలు కోరారు.

105 వినతులు

నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 105 మంది విచ్చేసి ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య దృష్టికి ఫిర్యాదులను తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఆమె ఆయా ప్రాంత పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ చెంచు రామారావు, లీగల్‌ అడ్వైజర్‌ టి.శ్రీనివాసులురెడ్డి, డీటీసీ, పీసీఆర్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు ఎం.నాగేశ్వరమ్మ, బి.శ్రీనివాసరెడ్డి, పి.భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● భర్త, అత్తింటివారు అదనపుకట్నం కోసం, ఆడపిల్ల పుట్టిందని అవమానిస్తూ ఇంటి నుంచి గెంటేశారని నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

● కుటుంబ సమస్యల నేపథ్యంలో భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని అనంతసాగరానికి చెందిన ఓ మహిళ కోరారు.

● బిట్రగుంటకు చెందిన చైతన్య కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.80 లక్షల నగదు తీసుకుని మోసగించాడని జలదంకి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

● ఉదయగిరి ప్రాంతానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు తన ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని పెళ్లికి నిరాకరించాడని ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ యువతి వినతిపత్రమిచ్చారు.

● గుంటూరు జిల్లా గురజాలకు చెందిన జానీబాషా బ్యాంక్‌ లోన్‌ ఇప్పిస్తానని ఇంటి కాగితాలు, రూ.3 లక్షలు తీసుకున్నాడు. లోన్‌ ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని నవాబుపేటకు చెందిన మహిళ అర్జీ ఇచ్చారు.

● గతేడాది మార్చి 24వ తేదీ నుంచి నా కుమారుడు కనిపించడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి సరిపెట్టుకున్నారు. విచారించి ఆచూకీ తెలియజేయాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement