కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం

Jul 29 2025 4:33 AM | Updated on Jul 29 2025 9:09 AM

కోర్ట

కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం

పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో అధికార పార్టీ నేతల కుట్రలు, కుతంత్రాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అధికార యంత్రాంగం సైతం ఎమ్మెల్యేలు చెప్పారంటూ వెనుకా ముందు చూడకుండా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసానికి బరితెగిస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన రోజే ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ దళిత నేత, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, వీరి చలపతికి చెందిన ఆస్తుల ధ్వంసానికి డెడ్‌లైన్‌ విధించారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక అనుచరుడు కావడంతో ఆయన్ను టార్గెట్‌ చేశారు. ఆస్తులు ధ్వంసం చేయడమేకాకుండా పలు అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీలో దళితుడైన కీలక నేత, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వీరి చలపతిరావును టీడీపీ టార్గెట్‌ చేసింది. మాజీమంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి కీలక అనుచరుడు కావడంతో ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలకు తెర తీశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న వీరి చలపతిరావు స్వగ్రామం నార్తురాజుపాళెంలో మెయిన్‌ రోడ్డుకు పక్కనే ఉన్న 50–2 సర్వే నంబరులో ఉన్న 25 అంకణాల స్థలాన్ని 2006లో యానాదమ్మ భర్త సాల్మన్‌ నుంచి రూ.2.50 లక్షలకు కొనుగోలు చేశారు. 2010లో పంచాయతీ అప్రూవల్‌తో ఆ స్థలంలో దుకాణాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కూడా పంచాయతీకి కట్టాల్సిన పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2016లో అప్పటి తహసీల్దార్‌ ఇది ఆక్రమణ స్థలంగా పేర్కొంటూ తొలగించాలంటూ నోటీసు జారీ చేశారు. దీనిపై చలపతిరావు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2018లో తన పేరిట ఉన్న స్థిరాస్తిని చలపతిరావు భార్య వీరి కళైవాణి పేరిట మార్పు చేశారు. అప్పటి నుంచి ఆమె కూడా ఆ ఆస్తికి సంబంధించిన పన్నులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందులో వైన్స్‌ షాపు నిర్వహించింది. అందుకు సంబంధించిన అద్దెను కూడా కళైవాణి ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది.

ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని..

ఈ ఏడాది జనవరిలో అందులో ఖాళీగా ఉన్న స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించుకునేందుకు పంచాయతీకి 14 శాతం ఫీజు చెల్లించి అనుమతులు పొందారు. అయితే వీరి చలపతిరావును టార్గెట్‌ చేసిన స్థానిక టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే మెప్పు కోసం కుట్రలకు తెరతీశారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 21న నార్తురాజుపాళెం చెందిన టీడీపీ నేత కరకటి మల్లికార్జున ఆ స్థలం ఆక్రమణ అంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 27న తహసీల్దార్‌ ఈ స్థలాన్ని పరిశీలించాలని స్థానిక ఇరిగేషన్‌ ఏఈని లేఖ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న ఇరిగేషన్‌ ఏఈ ఆ స్థలం ఆక్రమణ అంటూ తొలగించాలని తహసీల్దార్‌కు నివేదిక అందజేశారు. ఇరిగేషన్‌ ఏఈ, సర్వేయర్లు ఈ నెల 10న ఆ స్థలానికి చేరుకుని దుకాణాలు నిర్మాణం జరుగుతుండడాన్ని కొలతలు తీశారు. దీంతో స్థల యజమాని వీరి కళైవాణి ఈ నెల 14న హైకోర్టును ఆశ్రయించారు. పత్రాలు పరిశీలించిన హైకోర్టు నిర్మాణానికి ఎలాంటి అవాంతరాలు కల్పించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఆ ఉత్తర్వులు తనకు ఇంకా చేరలేదని తహసీల్దార్‌ చెప్పడంతో తన న్యాయవాది ద్వారా తెలియజేసినప్పటికీ ఇవేమీ పట్టని అధికారులు ఆ స్థలం ఆక్రమణలో ఉన్నందున ఈ నెల 31లోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని ఈ నెల 18న షోకాజ్‌ నోటీసును కళైవాణి భర్త వీరి చలపతిరావుకు అందజేశారు.

వివాదంతో ఊపందుకొన్న చర్యలు

కోవూరు నియోజకవర్గంలో ఈ నెల 7వ తేదీ నుంచి విభిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తనను విమర్శించారన్న నెపంతో మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న చలపతిపై కన్నెర్ర చేశారు. ఈ స్థలంపై టీడీపీ నేత మల్లికార్జున మే నెలలో ఫిర్యాదు చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 7 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఫిర్యాదుపై తాజా చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెల 16న షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, 18న చలపతిరావుకు అందజేయడం జరిగింది. ఈ నెల 31లోగా నిర్మాణాలు తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. పట్టించుకోకుండా చర్యలకు ఉపక్రమించడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి ఉందన్న ప్రచారం ఊపందుకొంది.

రాజుపాళెంలో దళిత నేత వీరి చలపతి షాపులు కూల్చేందుకు కుట్రలు

వాటి జోలికి వెళ్లొద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా పట్టించుకోని అధికారులు

వైఎస్‌ జగన్‌ పర్యటన రోజే కూల్చివేతకు తుది గడువుగా నోటీసులు

ఇప్పటికే ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుతంత్రం

అధికార పార్టీ నేతల తీరుపై మండిపడుతున్న ప్రజలు

నిబంధనల మేరకే చర్యలు

నార్తురాజుపాళెంలోని కళైవాణికి చెందిన స్థలం విషయంలో నిబంధనల ప్రకారమే ముందుకు పోతున్నాం. కోర్టు ఉత్తర్వుల్లో స్టేటస్‌కో మంజూరు చేసినట్లు లేదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు సూచించడం జరిగింది. ఆ విధంగానే నడుచుకొంటున్నాం. ఈ నెల 31వ తేదీ లోగా స్వచ్ఛందంగా ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించాలని నోటీసు ఇవ్వడం జరిగింది. అప్పటికీ తొలగించకపోతే తదుపరి చర్యలు తీసుకొంటాం.

– కె.స్ఫూర్తిరెడ్డి,

తహసీల్దార్‌, కొడవలూరు

కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం 1
1/1

కోర్టు ఆదేశాలున్నా సరే.. కూల్చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement