
వేగంగా ఇళ్ల నిర్మాణాలు
● కలెక్టర్ ఆనంద్
● అల్లూరు మండలంలో
విస్తృతంగా పర్యటన
అల్లూరు: ప్రభుత్వ లేఅవుట్లలో వేగంగా ఇళ్ల నిర్మాణాలను చేసి లబ్ధిదారులు నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత అల్లూరు – 2 పరిధిలోని నాగులదేవిగుంట వద్ద ఉపాధి హామీ కింద చేస్తున్న కాలువ పూడికతీత పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని పనిదినాలు పూర్తి చేశారు?, ఎంత వేతనం పొందుతున్నారు?, ఉపాధి పనులే కాకుండా వేరే పనులు చేస్తున్నారా? అని ఆరాతీశారు. తర్వాత రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ లేఅవుట్‌ను పరిశీలించారు. స్థానికులు మాట్లాడుతూ నీటి వసతి లేనందున పూర్తయిన గృహాల్లో ఇంకా చేరలేదని తెలియజేశారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ నీటి వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఆర్ కాలనీలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, అల్లూరు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రజనీకాంత్, కమిషనర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.