
తీర ప్రాంతాన్ని కబళించేందుకే కుట్రలు
కందుకూరు: పరిశ్రమల పేరుతో తీర ప్రాతంలో వేల ఎకరాలను ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకునే కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే భూసేకరణ పేరుతో ఇష్టారీతిన జీఓలు విడుదల చేస్తుందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆరోపించారు. బుధవారం తూమాటి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఇండోసోల్ కంపెనీ రూ.43,143 కోట్ల పెట్టుబడులతో 11,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిందని, ఆ కంపెనీ ప్రతిపాదనల ప్రకారం 2022లో 5,148 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు జీఓ ఇచ్చిందన్నారు. ఆ మేరకు గుడ్లూరు మండలం చేవూరులో 2,781 ఎకరాలను నోటిఫై చేసి, కంపెనీ నుంచి రూ.417 కోట్లను భూ సేకరణకు ఖర్చు చేసిందన్నారు. అందులో 1300 నుంచి 1400 ఎకరాలను వెంటనే కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండోసోల్ కంపెనీకి ఆ భూములు అప్పగించలేదని చెప్పారు. కేవలం 114 ఎకరాల మాత్రమే గుర్తించినా 49 ఎకరాలనే అప్పగించిందని, మిగిలిన 65 ఎకరాలను కూడా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ప్రస్తుతం ఈ 49 ఎకరాల్లోనే ఇండోసోల్ కంపెనీ కొన్ని యూనిట్లు ఏర్పాటు చేసిందన్నారు.
గందరగోళం జీఓలతో రైతుల్లో ఆందోళన
కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 3న బీపీసీఎల్ కంపెనీ రూ.96,862 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు, అందుకు 6 వేల ఎకరాలు కేటాయిస్తున్నట్లు జీఓను విడుదల చేసిందన్నారు. అప్పటికే ఇండోసోల్ కంపెనీ డబ్బులతో సేకరించిన భూములను ఆ కంపెనీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బీపీసీఎల్‌కి కేటాయిస్తున్నట్లు ఎలా జీఓ ఇస్తారని నిలదీశారు. ఈ గందరగోళం ఇలా ఉండగానే మార్చిలో ఇండోసోల్ కంపెనీకి కరేడులో 8,364 ఎకరాలు భూములు ఇస్తున్నట్లు, ఆ కంపెనీ రూ.69 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు జీఓను విడుదల చేశారన్నారు. దీని ప్రకారం ఇండోసోల్ కంపెనీకి రూ.41 వేల కోట్ల ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారని వివరించారు. ఇదే ఇండోసోల్ కంపెనీకి గత ప్రభుత్వం రూ.27 వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తే దోపిడీ అంటూ విమర్శించిన ప్రభుత్వ పెద్దలు, జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులదంటూ, ఇష్టారీతిన రాయితీలు ఇస్తూ దోపిడీకి పాల్పడుతుందని గతంలో నానా యాగీ చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అదే కంపెనీకి భారీగా రాయితీలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ఇలా ఉంటే నాలుగు రోజుల క్రితం రామాయపట్నం పోర్టు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటు కోసం 20 వేల ఎకరాలు భూములు సేకరించాలంటూ కావలి భూసేకరణ ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఐదు టీంలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇటు ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద నుంచి అటు కావలి వరకు తీర ప్రాంతంలోని భూములను కబళించేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు అర్థమవుతుందని చెప్పారు. ఇండోసోల్ కంపెనీకి కేటాయించిన భూములను ప్రస్తుతం బీపీసీఎఎల్ కంపెనీకి కేటాయించడంలో ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఆ కుట్రను అన్ని ఆధారాలతో త్వరలోనే బయటపెడతానని చెప్పారు.
కరేడులో 4,961 కుటుంబాలు రోడ్డున పడతాయి
ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణతో కరేడు పంచాయతీ పరిధిలోని 18 గ్రామాల పరిధిలో దాదాపు 4,961 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో 2,352 కుటుంబాలు మత్స్యకార, 1,436 కుటుంబాలు యానాదులు ఉన్నారని, వీరంతా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వీరందరిని ఖాళీ చేస్తే వారి జీవనం ఎలాగో సమాధానం చెప్పడం లేదన్నారు. కేవలం 2 వేల కుటుంబాలకు మాత్రమే భూములు ఉన్నాయని, అవి కూడా అర ఎకరం నుంచి ఎకరం లోపే ఒక్కొక్కరికి భూములు ఉన్నాయని చెప్పారు. కరేడులో బలవంతంగా భూములు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవడం దారుణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగానే అక్కడి రైతులు ఉద్యమిస్తున్నారని, వారి ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వివరించారు.
ఖాళీ భూములను ఎందుకు ఇవ్వడం లేదు
నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోనే వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నా ఆ భూముల్లో పరిశ్రమలకు కేటాయించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మాలకొండ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుకు సేకరించిన 12 వేల ఎకరాలు, దొనకొండలో 25 వేల ఎకరాలు, ఇఫ్కో కేటాయించిన భూములు ఖాళీగానే ఉన్నాయన్నారు. ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్న కరేడు రైతులను తాము రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా రైతుల అభిప్రాయాలను గౌరవించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కరేడు భూములను కాపాడాలని ఎమ్మెల్యే ఇంటూరికి సూచించారు.
కరేడులో భూసేకరణ పేరుతో
ప్రభుత్వం అడ్డగోలుగా జీఓలు
ఇండోసోల్ కంపెనీకి గత ప్రభుత్వం కేటాయించిన భూములు ఎందుకు అప్పగించలేదు
బీపీసీఎల్‌కు 8 వేల ఎకరాలు
కేటాయిస్తున్న జీఓ ఇవ్వడం ఏమిటి
పొంతనలేని జీఓలు, నోటిఫికేషన్లతో రైతుల్లో ఆందోళన
కరేడు రైతులకు వైఎస్సార్‌సీపీ
అండగా నిలుస్తుంది
ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు