
కనికరం లేకుండా..
పింఛన్ సొమ్ము..
ఇంటి పన్నుకు జమ
ఆత్మకూరు: వృద్ధులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. గ్రామాల్లో ఇంటి పన్నులు చెల్లించలేదని పింఛన్‌లో కోత విధించి ఇస్తున్న వైనం ఆత్మకూరు మండలంలోని కనుపూరుపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నేలటూరి సుబ్బరాయుడు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. పక్షవాతానికి గురై మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పన్ను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల సచివాలయానికి చెందిన ఓ ఉద్యోగి పింఛన్‌లో రూ.1,000 తగ్గించి మిగిలింది చేతిలో పెట్టింది. ఇదేంటని అడిగితే పంచాయతీ కార్యదర్శి చెప్పాడని, అందుకే పింఛన్‌లో ఇంటి పన్ను మినహాయించుకుని మిగిలిన నగదు ఇచ్చినట్లు చెప్పారు. తమ వద్ద కూడా ఇదే విధంగా పింఛన్‌లో ఇంటి పన్ను నగదును జమ చేసుకుని మిగిలింది ఇచ్చారని కాలనీకి చెందిన వడిగ సుగుణమ్మ, బొడ్డు లక్ష్మమ్మ, దాసరి అయ్యన్న, నేలటూరి వెంకటయ్య, కటారి చిన్న పెంచలయ్య, గొర్రిపాటి శంకరయ్య తదితరులు వాపోయారు.
మరుసటిరోజు ఇంటి పన్నుకు సంబంధించిన రశీదులు ఇచ్చారన్నారు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం ఏమిటని, దానిని పింఛన్‌కు ముడిపెట్టడం దారుణమని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై సంబంధిత పంచాయతీ కార్యదర్శి, సచివాలయం ఉద్యోగిని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.