
అదనపు కట్నం కోసం వేధింపులు
నెల్లూరు(క్రైమ్): అదనపు కట్నం కోసం వివాహితను వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై కేసును చిన్నబజార్ పోలీసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరానికి చెందిన అంజుమ్‌కు కావలికి చెందిన ఇర్ఫాన్ అలీతో వివాహమైంది. కొద్దిరోజులు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఆపై అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేయసాగారు. మద్యం మత్తులో ఆమెను భర్త మానసికంగా, శారీరకంగా హింసించేవారు. వీరి వేధింపులను తాళలేక పుట్టింటికొచ్చారు. పెద్దల సమక్షంలో పలుమార్లు మధ్యస్థం చేసినా భర్త, అత్తింటివారి తీరులో మార్పురాలేదు. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో ఢీకొనడంతో
వాహనచోదకులకు గాయాలు
వెంకటాచలం: బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గూడూరుకు చెందిన మహేష్, రవి పనినిమిత్తం నిడిగుంటపాళేనికి వెళ్లారు. తిరిగి గూడూరు వెళ్లే క్రమంలో సర్వేపల్లి సమీపంలో బైక్‌ను వెనుక నుంచి ఆటో ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు.
వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు: వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సైలు జిలానీ, సాయిప్రసాద్ వివరాల మేరకు.. మండలంలోని కరటంపాడు గిరిజనకాలనీకి చెందిన అబ్బూరి శేషయ్య (64) నిత్యం మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో మద్యంలో పురుగుమందు కలుపుకొని శుక్రవారం సాయంత్రం సేవించారు. కొద్దిసేపటి అనంతరం గమనించిన బంధువులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వృద్ధురాలి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేర కు.. ఉత్తరప్రదేశ్‌లోని హ మీర్‌పూర్‌కు రామదులరై తన కుటుంబసభ్యులతో కలిసి ఝాన్సీ నుంచి తిరుపతికి రైలులో బయల్దేరారు. ఈ నెల 19న ఆమె నెల్లూరులో రైలు దిగారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై హరిచందన ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారానికి 42.019 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 2250, పిన్నేరుకు 20, లోలెవల్‌కు 60, హైలెవల్‌కు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

అదనపు కట్నం కోసం వేధింపులు