
ఉపాధి కూలీల ఆకలి కేకలు
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
నెల్లూరు (పొగతోట): జిల్లాలో ఉపాధి హామీ పథకం కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. సుమారు రూ.20 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయాయి. వీటిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.100 కోట్ల వరకు రావాల్సి ఉందని సమాచారం. శ్రామికులు పేమెంట్ల కోసం, సిబ్బంది వేతనాల కోసం, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉపాధి హామీ పథకాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేశారు. ఫలితంగా పథకం అమలులో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా వ్యాప్తంగా 80 శాతం మందికి పైగా ఫీల్డు అసిస్టెంట్లను తొలగించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు, మండల టీడీపీ నాయకులు సూచించిన వ్యక్తులనే ఎఫ్‌ఏలుగా నియమించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారు. ఒక్కో పంచాయతీలో ఇద్దరు ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లు పనిచేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో ఇద్దరు టీడీపీ నాయకులు ఉంటే వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎఫ్‌ఏలుగా నియమించాలంటూ ఎంపీడీఓలపై ఒత్తిడులు చేశారు. దీంతో ఎంపీడీఓలు నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌ఏలను నియమించారు. నిబంధనల ప్రకారం ఫీల్డు అసిస్టెంట్లపై ఆరోపణలు వస్తే విచారణ చేపట్టాలి. నివేదికలను జిల్లా అధికారికి అందజేయాలి. ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ అయితే అతన్ని విధుల నుంచి తొలగించాలి. అనంతరం పంచాయతీ తీర్మానంతో కొత్త ఎఫ్‌ఏను నియమించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం నిబంధనలకు పాతర వేసింది. చాలామందిని బెదిరించి తొలగించింది. అయితే తొలగించిన ఫీల్డు అసిస్టెంట్ల పేర్లే ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. కొత్తవారి పేర్లు ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో వేతనాలు ఎవరికి ఇవ్వాలో అధికారులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన యాప్‌లను సైతం బలవంతంగా లాక్కొని కొత్త ఫీల్డు అసిస్టెంట్లు చేత పనులు చేయిస్తున్నారు. ఉపాధి పనులకు సంబంధించి వచ్చే సంవత్సరం నిర్వహించే సోషల్ ఆడిట్‌లో ఎవరు పనులు చేశారు..? ఎవరిపైన పెనాల్టీలు వేయాలో..? అర్థం కాని పరిస్థితులు అధికారులకు ఎదురయ్యే అవకాశం ఉంది.
హాజరు శాతం పెంచాలని కలెక్టర్ చెబుతున్నా..
జిల్లాలో సుమారు 4 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన శ్రామికులు ఉన్నారు. నిత్యం లక్ష మందికి పైగా శ్రామికులు పనులకు హాజరు కావాల్సి ఉంది. కూటమి నేతలు అత్యుత్సాహం, కొత్త ఫీల్డు అసిస్టెంట్ల నియామకం, పేమెంట్లు చెల్లింపుల్లో నెలలతరబడి జాప్యం తదితర కారణాల వల్ల ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. ప్రస్తుతం 70 వేల నుంచి 80 వేల మంది శ్రామికులు పనులకు హాజరవుతున్నారు. వీరికి సుమారు రూ.20 కోట్లకు పైగా పేమెంట్లు బకాయిలు ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి పనులకు హాజరయ్యేవారి సంఖ్య లక్షకు పైగా పెంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వివిధ కారణాల వల్ల పనులకు హాజరయ్యేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
ఉపాధి పనులతో అభివృద్ధి కార్యక్రమాలు
ఉపాధి హామీ పనులు ఎంత ఎక్కువగా జరిగితే జిల్లాకు ఆ స్థాయిలో మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు అవుతాయి. ఉపాధి పథకం కింద భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్లు, డ్రైన్లకు నిధులు మంజూరు అవుతాయి. కూటమి ప్రభుత్వ నేతల అత్యుత్సాహం వల్ల ఉపాధి పనులకు బ్రేకులు పడుతున్నాయి. పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య తగ్గి పోయింది. ఫలితంగా జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు అరకొరగా మంజూరవుతున్నాయి.
మూడు నెలలుగా నిలిచిన పేమెంట్లు
జిల్లా వ్యాప్తంగా 4లక్షల జాబ్‌కార్డులు
ప్రస్తుతం పనులకు వస్తోంది 80 వేల మందే
సీసీ రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకూ
అందని బిల్లులు
ఉపాధి హామీ పథకం పనులు చేసే కార్మికులు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మూడు నెలలుగా వారికి వేతనాలు అందడం లేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.
వేతనాలు మంజూరవుతాయి
ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులకు త్వరలో పేమెంట్లు పూర్తి స్థాఽయిలో విడుదల కానున్నాయి. సిబ్బందికి సైతం మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. నెలాఖరుకు వేతనాలు మంజూరయ్యే అవకాశం ఉంది. ఉపాధి పనులు వేగవంతంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
– గంగాభవాని, డ్వామా పీడీ