వృద్ధుడి అనుమానాస్పద మృతి
సీతారామపురం: స్థానిక ఆరు లేన్ల జాతీయ రహదారి సమీపాన నల్లమేకల వెంగయ్య (63) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శుక్రవారం పోలీసుల వివరాలు వెల్లడించారు. మండలంలోని గుండుపల్లి గ్రామానికి చెందిన వెంగయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన కట్టెల కోసం అడవికి వెళ్లి తిరిగొస్తుండగా మార్గమధ్యలో దారి తప్పి జాతీయ రహదారి వద్ద నుంచి వస్తూ చనిపోయాడు. మృతదేహానికి కూత వేటు దూరంలో కట్టెలమోపు, గొడ్డలి, ఇనుపరాడ్ ఉన్నాయి. మృతుడి తల, శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో వెంగయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమో దు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కంట్లో కారం చల్లి..
● మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
వెంకటాచలం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం చల్లి ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని వడ్డీపాళెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వడ్డీపాళేనికి చెందిన ఉప్పు రత్నమ్మ తన నివాసంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమె కంట్లో కారం చల్లాడు. మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కేసులో
విచారణ వేగవంతం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని గోపాలపురంలో జరిగిన రైతు మల్లికార్జునరెడ్డి హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్యకు గల కారణాలను తెలుసుకున్నామన్నారు. గ్రామస్తులతో కూడా మాట్లాడినట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఆయన వెంట బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై సంతోష్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
కోన అడవుల్లో అస్తిపంజరం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వాటర్ ఫాల్స్ వద్ద వ్యక్తి అస్తిపంజరాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి వెళ్లడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి అస్తిపంజరాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
535 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 535 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 7,803 మందికి గానూ 7,323 మంది హాజరై 480 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,058 మందికి గానూ 1,003 మంది హాజరై 55 మంది గైర్హాజరయ్యారు.
కండలేరులో
43.792 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 43.792 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,300, పిన్నేరు కాలువకు 100, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


