మహా ప్రళయంపై ఆందోళనలో దళితులు
అటవీశాఖ భూముల్లో క్వారీ నిర్వహణకు అనుమతులిచ్చేందుకు పలు శాఖల అధికారులు బరి తెగించారు. అధికార పార్టీలోని అనకొండలు విసిరిన నోట్ల కట్టలకు కొండలను కానుక ఇచ్చేందుకు ఆగమేఘాల మీద సిద్ధపడ్డారు. రాసివ్వడానికి ఇదేమైనా వీరికి అత్తగార్లు ఇచ్చిన జాగిర్లు కాదే. అటవీశాఖ భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగించాలన్నా.. కేంద్ర అటవీశాఖతోపాటు పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని అటవీ, పర్యావరణ, రెవెన్యూ శాఖలు కట్టకట్టుకుని వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చూస్తే ఏ స్థాయిలో చట్టాన్ని ధిక్కరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోంది.
అటవీ భూముల్లో క్వారీకి ఆగమేఘాల మీద అనుమతులు
సంగం కొండ మీద క్వారీ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం తెలియడంతో కొండ కింద ఉన్న అరుంధతీయులు ఆందోళన చెందుతున్నారు. కొండపై క్వారీకి అనుమతిస్తే.. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిస్తే కొండ చెరియలు కరిగి దిగువన ఉన్న నివాసాలను కప్పేసే ప్రమాదం ఉందని స్థానికులు భయకంపితులు అవుతున్నారు. గతేడాది కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో భారీ వర్షాలకు ఊరుకు ఊరుకే సమాధి అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి తమకు ఎదువుతుందంటున్నారు. గతంలో కొండ దిగువన ఉన్న క్వారీ కోసం జరిపిన పేలుళ్ల ధాటికి సంగం రాళ్లచెలిక ఎస్సీ కాలనీలో రాళ్లు పడి పలు ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్వారీని మూసివేస్తే ఆనంద పడ్డామని, మళ్లీ కొత్త క్వారీ వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నామని దళితులు ఆవేదన చెందుతున్నారు.
●


