నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 12 2025 12:04 AM | Updated on May 13 2025 6:06 PM

హాజరుకానున్న 24,835 మంది విద్యార్థులు

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం స్థానిక స్టోన్‌హోస్‌పేటలోని కార్యాలయంలో ఆర్‌ఐఓ వరప్రసాదరావు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దీనదయాళ్‌, వేణుగోపాల్‌, కొండయ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షలు ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 24,211 మంది జనరల్‌, 624 మంది ఒకేషనల్‌ కలిపి మొత్తం 24,835 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 21,068 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 3,767 మంది హాజరుకానున్నారు. 

ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్ష జరగనుంది. ఇంటర్‌ పరీక్షల కోసం కంట్రోలు రూం నంబరు 0861–2320312 ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

రెండోకారుకు రికార్డ్‌ స్థాయిలో నీరు

ఆత్మకూరు: ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలకు రెండోకారుకు సాగునీరు అందిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో ఆదివారం ఆత్మకూరు నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గతంలో అత్యధికంగా 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే రెండోకారుకు సాగునీరు అందించినట్లు, దానికి మూడు రెట్లుగా ఈ ఏడాది రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని సాగునీరు విడుదల చేశామన్నారు. నాన్‌ డెల్టాకు నాలుగు కాలువల ద్వారా 1.64 లక్షల ఎకరాలకు 16 టీఎంసీల నీటిని కేటాయించి విడుదల చేశామన్నారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు 22 టీఎంసీల నీటిని కేటాయించినట్లు వివరించారు. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మురళీ అనే సైనిక వీరుడికి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ కేశవ చౌదరి, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.

ములుమూడిలో రెండువర్గాల కొట్లాట

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ మండలంలో ఓ వివాహ వేడుక సమయంలో చెలరేగిన గొడవ మరుసటిరోజు రెండువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. రూరల్‌లోని ములుమూడి గ్రామంలో శనివారం వివాహ వేడుక జరిగింది. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన యువకులు గొడవకు దిగారు. పెద్దలు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి పంపించేశారు. అయితే ఆదివారం టీడీపీ వర్గానికి చెందిన యువకులు కొందరు వైఎస్సార్‌సీపీకి చెందిన యువకులను దుర్భాషలాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో గ్రామస్తులు వారిని సముదాయించారు. ఈ విషయంపై రెండు వర్గాలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మితిమీరిన వేగంతో కారు బీభత్సం

నెల్లూరు(క్రైమ్‌): ఓ ఇన్నోవా కారు నడిపే వ్యక్తి ఆదివారం రాత్రి నగరంలో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో ఆత్మకూరు బస్టాండు నుంచి ఓల్డ్‌ చెక్‌పోస్టు వైపు వాహనాన్ని పోనిచ్చారు. కారును ఆపేందుకు యత్నించినా వినకుండా అందులోని వ్యక్తి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొనే ప్రయత్నం చేయడంతో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఎట్టకేలకు ట్రాఫిక్‌ పోలీసులు కారును వెంబడించి ప్రశాంతినగర్‌ జాతీయ రహదారి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement