కళ్లకు గంతలతో నిరసన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం మహిళల మీద చేసిన దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా నేతలు కళ్లకు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నగర వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు దౌర్జన్యం, అలాగే కంతేరు ఎంపీటీసీ కల్పనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ఈ రెండు ఘటనల్లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంలో కీచకపర్వంగా ఆమె అభివర్ణించారు. అందుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని మహిళలందరూ నిరసన తెలియచేస్తున్నామన్నారు. చంద్రబాబునాయుడుకి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. కార్పొరేటర్ కామాక్షిదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.


