భూ ఆక్రమణ.. సమష్టిగా అడ్డగింత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్ల భూ ఆక్రమణ యత్నాన్ని గ్రామస్తులు సమష్టిగా అడ్డుకున్నారు. వాస్తవానికి కలువాయి మండలం తెలుగురాయపురంలో 130 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు వీరు ముమ్మర యత్నాలు చేశారు. ఈ క్రమంలో ‘బాబోయ్.. భూచోళ్లు’ శీర్షికన సాక్షిలో కథనం గత నెల్లో ప్రచురితమైంది. దీన్ని చూసిన గ్రామస్తులు తమ భూములను రక్షించుకునేందుకు ఏకమయ్యారు.
కుటిల యత్నానికి బ్రేకులు
భూములను చదును చేసేందుకు గానూ యంత్రాలను కూటమి నేతలు రెండు రోజుల నుంచి రంగంలోకి దింపారు. దీంతో వీటిని గ్రామస్తులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. సమస్యను మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చారు. ఫలితంగా టీడీపీ నేతల యత్నాలకు స్థానికులు బ్రేకులేశారు. చదును చేస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేసి, భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
జరిగిందిదీ..
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక భూములు, ఇసుక, గ్రావెల్ మాఫియాలు అధికమయ్యాయి. ఖాళీగా భూములు కనిపిస్తే ఆక్రమించేందుకు యత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ కోవలోనే తెలుగురాయపురంలో 130 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు తెలుగు తమ్ముళ్లు, మరికొందరు తమ యత్నాలను ముమ్మరం చేశారు. విషయం పత్రికల్లో రావడంతో కంగుతిన్న వారు కొద్ది రోజులు మిన్నకుండిపోయారు. తదనంతరం ఎవరూ స్పందించడంలేదనే ఉద్దేశంతో ఆక్రమించేందుకు చదును చేయడాన్ని షురూ చేశారు. గమనించిన ప్రజలు తిరగబడ్డారు.
మాయాజాలం
గ్రామంలోని సర్వే నంబర్ 585 / 2, 586 / 1, 590 / 3, 593 / 1, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో 130 ఎకరాలున్నాయి. 2013లో ఇతర జిల్లాలు, పక్క మండలాలకు చెందిన వారికి పట్టాలను మంజూరు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 187 / 5, 565 / 3, 597 / 2, 597 / 1 సర్వే నంబర్లలో 14 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌లో పెట్టారు. మిగిలిన వాటి పట్టా పేర్ల మార్పునకు రంగం సిద్ధం చేశారు. 597 / 1లో సిద్ధిరాజుకు 2.67 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. 592 / 3లో అదే పేరుతో 2.3 ఎకరాలు డీ పట్టాగా ఉంది. ఇక్కడే రెవెన్యూ అధికారుల మాయాజాలం అర్థమవుతోంది. మరోవైపు ఫిబ్రవరి, 2014లో వెంకటసుబ్బరాజుతో పాటు 25 మంది లబ్ధిదారులు తమకు భూములు చూపించలేదంటూ కోర్టును ఆశ్రయించారు. గ్రామంలో పేద బడుగు, బలహీనవర్గాలకు చెందిన అనేక మంది ఉండగా, భూములను పక్క జిల్లాలు, వేరే మండలాలకు చెందిన వారికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
గద్దల్లా వాలి..
తెలుగురాయపురం సమీపంలో నేషనల్ హైవే వస్తుందనే సమాచారంతో వీటిపై టీడీపీ నేతల కన్నుపడింది. ఎకరా దాదాపు రూ.15 లక్షలకుపైగా ఉందని సమాచారం. ఈ తరుణంలో సుమారు రూ.20 కోట్లు విలువజేసే భూమిని కాజేసేందుకు పచ్చ నేతలు తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వీరి చేష్టలకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. కోర్టులో వివాదం ఉన్నా, పట్టాలు మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
తెలుగురాయపురంలో 130 ఎకరాల కబ్జాకు తెలుగు తమ్ముళ్ల యత్నం
ఆందోళనకు దిగిన స్థానికులు
చివరికి హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఆక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు చేపడతాం. తెలుగురాయపురంలో 130 ఎకరాలను పరిరక్షించేలా చూస్తాం. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. భూముల్లోకి ఎవరు దిగినా కేసులు నమోదు చేస్తాం.
– శ్యామ్‌సుందర్, తహసీల్దార్, కలువాయి
భూ ఆక్రమణ.. సమష్టిగా అడ్డగింత


