
ప్యాకేజీ తీసుకో.. పసుపు కండువా కప్పుకో
కోవూరు: కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతల కొనుగోళ్ల ప్రక్రియ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా విడవలూరుకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత ఒకరికి భారీగా ప్యాకేజీ ఇచ్చి పసుపు కండువా కప్పేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న కాలంలో మాజీమంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విడవలూరుకు చెందిన ఓ సీనియర్ నేతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన్ను పార్టీలో జిల్లా స్థాయి పదవు లతోపాటు ఆయన భార్యకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్‌గా పదవిని కట్టబెట్టి ఆ కుటుంబానికి అగ్ర తాంబూలమిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా లబ్ధిపొందిన సదరు సీనియర్ నేత ప్యాకేజీలకు అమ్ముడుపోయి పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడటాన్ని స్థానిక నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇటువంటి స్వార్థపూరిత నేత అని తెలియక వారి వెంట నడిచామని పార్టీ కేడర్ విచారం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నేతలు పార్టీని వీడినా పార్టీకి ఎటువంటి ఢాకాలేదని, ప్రజలే పార్టీకి బలమన్నారు. లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఇచ్చుకుని పచ్చకండువాలు కప్పుతుండడం వెనుక మరో ఏడాదిలో జరగబోయే స్థానిక సంస్థల్లో గెలుపు కోసమేనని ప్రచారం జరుగుతుంది. దాదాపు 11 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు, నష్టాలు, ఎదుర్కొంటున్న కొత్త అనుభవాలతో ప్రజలు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూటమిని కూకటి వేళ్లతో సహా పెకళించేందుకు పల్లెల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లి పబ్బం గడుపుకునే నేతలను పార్టీలో చేర్చుకున్నప్పటికీ రేపటి స్థానిక ఎన్నికల్లో ప్రజలు చూపించే ఓటు దెబ్బతో ఎమ్మెల్యేకు, టీడీపీకి త్వరలోనే జ్ఞానోదయం కలుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతల కొనుగోళ్లలో ప్రశాంతిరెడ్డి బిజీబిజీ
తాజాగా విడవలూరు సీనియర్ నేతకు భారీ మొత్తం ప్యాకేజీ ఆఫర్
ఆయనకు, భార్యకు రాష్ట్ర స్థాయిలో పదవులు కట్టబెట్టిన ప్రసన్న
అధికారం, పదవులు అనుభవించి.. ఇప్పుడు వెన్నుపోటు