కాకాణితో ప్రారంభమై.. | - | Sakshi
Sakshi News home page

కాకాణితో ప్రారంభమై..

May 6 2025 12:09 AM | Updated on May 6 2025 12:09 AM

కాకాణ

కాకాణితో ప్రారంభమై..

● అదుపు తప్పిన శాంతిభద్రతలు

జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, హత్యాయత్నాలతో జిల్లా అట్టుడికిపోతోంది. కావలిలో బృందావనం కాలనీలో జరిగిన భారీ చోరీలో ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. కావలి సమీపంలో ఒక మహిళ హత్య కేసులో ఇంత వరకు చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. కానీ అసమర్థ పాలకుల చేతిలో కొందరు ఖాకీలు.. కీలుబొమ్మలా మారి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు కట్టి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్య హననానికి పాల్పడ్డారు. మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేసి గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తున్న ఖాకీ.. సిగ్గుపడు.

కట్టడి చేయలేని కొందరు పోలీసులు

పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి

ప్రజాస్వామ్యం హననం

రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గులాంగిరి

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులా

ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏమిటి?

సాక్షి ప్రతినిధి నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, ఎంపీ దాకా మట్టి నుంచి ఇసుక, గ్రావెల్‌, క్వార్ట్‌ ్జ, మైకా వరకు సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పార్టీ క్యాడర్‌ ఊరూరా మద్యం బెల్టు షాపులు పెట్టి బరితెగించి విక్రయాలు సాగిస్తున్నారు. మరో వైపు రేషన్‌ బియ్యం, కోళ్ల వ్యర్థాలు, పశువుల అక్రమ రవాణా దందా సాగిస్తూ రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇంకో వైపు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై లైంగిక దాడులు వంటి దారుణాలు జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయలేని జిల్లాలో కొందరు పోలీసులు అసమర్థ పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మాత్రం కచ్చితంగా అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే మీడియా కావచ్చు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌ యాక్టివిస్టులైనా సరే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌లు ఫార్వార్డ్‌ చేయడాన్ని కూడా నేరంగా భావించి కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పసుపు చొక్కా తొడగని సామాన్యుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కావలిలో సాక్షి జర్నలిస్టుతో సహా నలుగురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో అసమర్థ పాలకులకు తాకట్టు పెట్టారు.

● తాజాగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఐదేళ్ల కిందట అమృత్‌ స్కీమ్‌ పైలాన్‌ ధ్వంసం చేశారంటూ మూసేసిన పాత కేసును తిరిగి తెరిచి హత్యాయత్నం కేసు జోడించి నమోదు చేశారు. కావలిలో 2020లో అమృత్‌ పథకం పైలాన్‌ ధ్వంసం చేసిన కేసును తిరగతోడి మీడియా ప్రతినిధులు సహా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేతలు 12 మందిని నిందితులుగా చేర్చి అక్రమ కేసు బనాయించారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అవినీతి, అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుల నుంచి ఎన్నికల సమయంలో వ్యతిరేక పోస్టింగ్‌లు పెట్టినందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. సామాన్య జర్నలిస్టులు పలుగు, పార పట్టుకుని పైలాన్‌ ధ్వంసం చేయడంతోపాటు అడ్డుచెప్పబోయిన టీడీపీ కార్యకర్తలను తరిమి కొట్టి హత్యాయత్నం చేశారని రిమాండ్‌ రిపోర్టులో చూపించడంపై పోలీస్‌ శాఖ చూపించిన అత్యుత్సాహం నివ్వెరపోయేలా ఉంది.

మాజీ మంత్రి అనిల్‌ను టార్గెట్‌ చేసి

రేపోమాపో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌పై అక్రమ కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా ముందు బాహాటంగా చెప్పడం చూస్తుంటే జిల్లాలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం పతాక స్థాయి చేరిందని చెప్పొచ్చు. సైదాపురంలో మైనింగ్‌ మాఫియా దోపిడీపై రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్‌ పెట్టిన మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను టార్గెట్‌ చేసి అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమవుతున్నట్లు, త్వరలోనే అరెస్ట్‌ అవుతున్నాడని ఎమ్మెల్సీ బీద సోమవారం ప్రెస్‌మీట్‌ ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇరిగేషన్‌ శాఖలో అక్రమాలు జరిగాయని, అక్రమ మైనింగ్‌లో అతని ప్రమేయం ఉందని ఆ రెండు వ్యవహారాల్లో కేసులు నమోదుకు తుది దశకు చేరుకుందని చెప్పడం చూస్తుంటే మాజీమంత్రిని టార్గెట్‌చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం సైదాపురంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లో జరిగే మైనింగ్‌ను వెలుగులోకి రానివ్వకుండా ఉండేందుకు అక్రమ కేసులు బూచి చూపిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం వైఎస్సార్‌సీపీ కీలక నేతలందరిపై కేసుల పరంపర కొనసాగించే రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి కొందరు పోలీసులు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఏడు కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి అవినీతి అక్రమాలపై నిత్యం ఎండగట్టుతుండడంతో ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారింది. కాకాణిని టార్గెట్‌ చేసి ఏడు నెలలు వ్యవధిలోనే ఏడు కేసులు నమోదు చేయించారు. వాట్సాప్‌ గ్రూపుల్లో పేపర్‌ కటింగ్‌లు ఫార్వార్డ్‌ చేశాడనే కారణం నుంచి అక్రమ మైనింగ్‌ అంటూ అట్రాసిటీ కేసులు అంటూ ఏడు కేసులు పెట్టి ఆయన్ను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆ కుటుంబానికి నరకం చూపిస్తున్నారు.

కాకాణితో ప్రారంభమై.. 
1
1/1

కాకాణితో ప్రారంభమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement