
బీదా.. అక్రమ మైనింగ్ కనపడదా?
నెల్లూరు (పొగతోట): సైదాపురంలో అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఆధారాలతోసహా వెల్లడిస్తే.. టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎందుకు ఉలికి పడుతున్నాడో అర్థం కావడం లేదని జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్, రాష్ట్ర సంగీత, నృత్య కళా అకాడమీ మాజీ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శీరిషా ప్రశ్నించారు. జిల్లాలో అక్రమ మైనింగ్‌పై కేసులు నమోదు చేయాల్సి వస్తే.. ముందు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు అనేక మంది టీడీపీ నేతలపై చేసి అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మీడియా సమావేశానికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రెస్‌మీట్ పెట్టి అక్రమ మైనింగ్ జరగడం లేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. సైదాపురం వస్తే నీకు నిజాలు తెలుస్తాయని అంటూ బీదకు సూచించారు. ఎంపీ వేమిరెడ్డి సైదాపురంలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారంటూ చెబుతున్నారని, ఎవరిని ఉద్దరించడానికి అని నిలదీశారు. ప్రజలను ఉద్దరించడానికే అయితే శంకుస్థాపన కూడా చేయని ఫ్యాక్టరీ కోసం పది నెలలుగా అన్ని మైన్లు ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. మైనింగ్ పనులపై ఆధారపడిన వారిని వేలాది కుటుంబాలను రోడ్డుపాల్జేయడం నిజం కాదా అని నిగ్గదీశారు.
కళ్లు తెరిచి చూడయ్యా..
సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్సీ బీదకు అవగాహన లేనట్టుందన్నారు. ఎమ్మెల్సీ అపాయింట్‌మెంట్ ఇస్తే ఆధారాలు చూపిస్తానని, లేదా అధికారులెవరైనా వచ్చినా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను చూపిస్తానన్నారు. ఇక్కడ వేమిరెడ్డికి సంబంధించి లక్ష్మీ క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్, ఫినీ కంపెనీల ద్వారా క్వార్ట్ ్జను ఆయన మనుషులు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. అనుమతులున్న మైనింగ్ కంపెనీలను మూసివేసి, అనుమతుల్లేని కంపెనీల ద్వారా వీపీఆర్ మైనింగ్ చేస్తున్నారన్నారు. అనుమతులున్న కంపెనీలు మైనింగ్ చేయాలంటే క్వార్ట్ ్జను నాకే విక్రయించాలని వీపీఆర్ కండీషన్ పెట్టారని, ఇది ఎంత వరకు సమంజసమని బీద రవిచంద్రను ఆమె ప్రశ్నించారు. ఈ విషయాలు తెలియకపోతే వచ్చి కళ్లు తెరిచి చూడాలని శీరిషా చెప్పారు. అక్రమ మైనింగ్ ఆపాలని నాలుగు నెలలుగా కలెక్టర్, మైనింగ్ డీడీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులను కలిసి వినతి పత్రం కూడా ఇచ్చామన్నారు. అనుమతి లేని మైనింగ్ గనుల్లో జిలెటెన్ స్టిక్స్ వాడుతున్నారని డీఎస్పీకి, ఎస్సైకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
చైనాలోనా.. సైదాపురంలోనా?
వీపీఆర్ ఫ్యాక్టరీ పెడుతున్నారంటూ బీద చెబుతున్నారని, అయితే లక్ష్మీ క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా చైనాకు 10 వేల టన్నుల క్వార్ట్ ్జను ఎగుమతి చేశారని, దీన్ని పరిశీలిస్తే కంపెనీ చైనాలో పెడుతున్నారా? అని పొట్టేళ్ల శీరిషా ప్రశ్నించారు. పద్మావతి మైనింగ్, సిద్ధి వినాయక మైనింగ్ కంపెనీలకు కూటమి ప్రభుత్వంలోనే డీఎంజీ అనుమతులు రిజెక్ట్ చేసిందన్నారు. ఈ రెండు మైన్‌లు 50 ఏళ్లు పూర్తయినవని, గడువు పూర్తయిన మైన్లలో వీపీఆర్ మనుషులు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఇది అక్రమ మైనింగా? సక్రమ మైనింగా అని బీద రవిచంద్ర చెప్పాలని ప్రశ్నించారు. వేమిరెడ్డి అక్రమ మైనింగ్ వల్ల వేల కుటుంబాలు పనులు లేక రోడ్డున పడ్డాయన్నారు. పేదల ఉసురు ప్రభాకర్‌రెడ్డికి తగులుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర జంగం కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ ప్రసన్న, కార్పొరేటర్లు గుంజి జయలక్ష్మి, కామాక్షిదేవి, ఆర్.జెస్సీ, ప్రమీల, సరిత తదితరులు పాల్గొన్నారు.
గద్వాల్ రౌడీ మూకలతో కాపలా
తెలంగాణలోని గద్వాల్ రౌడీ మూకలతో అక్రమ మైనింగ్ ప్రాంతంలో కాపలా పెట్టారని పొట్టేళ్ల శీరిషా చెప్పారు. సాయి అనే వ్యక్తి నాది తెలంగాణ, నేను నాలుగు హత్యలు చేశానని చెప్పుకుంటూ నంబర్ ప్లేటు లేని కారులో తిరుగుతూ మైనింగ్ జరిగే ప్రాంతానికి ప్రజలను, మీడియాను కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. బీద మాటమీద నమ్మకంతో మేము అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి వెళ్తున్నామన్నారు. అక్కడ మాకు ఏం జరిగినా ఆయనదే పూచీ అని ఎస్పీకి మీడియా ముఖంగా విన్నవిస్తున్నామన్నారు. రాజకీయ స్వార్థంతో పార్టీలు మారుతూ తెల్ల రాయిని వ్యాపారంగా మార్చుకుని రూ.కోట్లు సంపాదిస్తున్న వేమిరెడ్డి అండ్ కో నిందలు మాత్రం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వేయడం సమంజసం కాదని తెలిపారు.
ఫ్యాక్టరీని చైనాలోనా, సైదాపురంలో నిర్మిస్తారా?
పనుల్లేక వేల కుటుంబాలు రోడ్డు పాలు
స్వార్థం కోసం పార్టీ మారి రూ.కోట్లు సంపాదిస్తున్న ఎంపీ వేమిరెడ్డి
జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్
పొట్టేళ్ల శీరిషా